జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడం వల్ల సినిమాలకు దూరమయ్యాడు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో పవన్ సైతం ఓటమి చెందాడు. జనసేనకు కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కింది. ఈ నేపథ్యంలో పవన్ మళ్ళీ సినిమాల్లోకి వస్తారంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. కానీ తాను రాజకీయాల్లోనే కొనసాగబోతున్నట్లు పవన్ ఇదివరకే ప్రకటించారు. 

తాజాగా మెగా అభిమానులు పండగ చేసుకునే వార్త ఒకటి సినీవర్గాల నుంచి అందుతోంది. కొన్నేళ్ల క్రితం తాను తన బాబాయ్ పవన్ కళ్యాణ్ నిర్మాణంలో నటించబోతున్నట్లు రాంచరణ్ ప్రకటించాడు. కానీ వివిధ కారణాలవలన ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో ఈ చిత్రం నిర్మాణం కావాల్సింది. ఇక ఇప్పట్లో పవన్, రాంచరణ్ సినిమా ఉండదనుకుంటున్న తరుణంలో మరోమారు ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. 

పవన్ కళ్యాణ్ స్వయంగా తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని రాంచరణ్ కోసం ఓ కథ సిద్ధం చేయమని అడిగాడట. తానే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు త్రివిక్రమ్ కు తెలియజేశాడట. రాంచరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి అన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.