జనసేన పార్టీ గత ఎన్నికల్లో పరాజయం చెందినప్పటికీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఎలాగైనా బలపరచాలని ప్రయత్నిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ సైరా ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన సోదరుడు చిరంజీవితో కలసి వేదిక పంచుకున్న సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా త్వరలో మీడియా ప్రతినిధులు విజయవాడలో మీడియా హక్కులపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కు ఆహ్వానం అందింది. కానీ తాను ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నట్లు పవన్ ఓ ప్రకటనలో తెలిపారు. 

ఆరోగ్య సమస్యల కారణంగా తాను రాలేనని,, జనసేన తరుపున తమ పార్టీ ప్రతినిధులు హాజరవుతారని పవన్ పేర్కొన్నారు. గబ్బర్ సింగ్ చిత్ర సమయం నుంచి తనని వెన్నునొప్పి సమస్య వేధిస్తోందని అన్నారు. ఇటీవల ఆ సమస్య ఎక్కువైంది. వైద్యుల సలహా మేరకు బయటకు వెళ్లడం లేదు. 

వైద్యులు సర్జరీ చేయించుకోవాలని సూచించారు. కానీ సహజవైద్యంపై నమ్మకంతో దానినే కొనసాగిస్తున్నానని పవన్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం కావాలని పవన్ ఆకాంక్షించారు.