సూపర్ స్టార్ రజినీ కాంత్ అస్వస్థ పాలైన సంగతి తెలిసిందే. అన్నాత్తే మూవీ షూటింగ్లో రజినీ కాంత్ పాల్గొనడం జరిగింది. అయితే ఈ షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొన్న ఎనిమిది మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీనితో రజిని కాంత్ సైతం కోవిడ్ టెస్ట్స్ చేయించుకున్నారు. ఆయనకు కోవిడ్ నెగిటివ్ అని రిజల్ట్ రావడం జరిగింది. అయినప్పటికీ ఆయన అనారోగ్యంగా కనిపించడంతో హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఈ మేరకు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై అపోలో వర్గాలు బులెటిన్ విడుదల చేశాయి. 


ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించారు. రజినీకాంత్ గారు త్వరగా కోలుకోవాలని ఓ లేఖ విడుదల చేశారు. రజినీ కాంత్ గారు అస్వస్థతకు గురయ్యారని తెలిసి బాధపడ్డాను. అయితే ఆయన కరోనా బారిన పడకపోవడం ఉపశమనం కలిగించింది. ఆధ్యాత్మిక పరులైన రజినీకాంత్ గారికి దేవుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఆయన విశ్వసించే మహావతార్ బాబాజీ ఆశీస్సులు ఎప్పుడూ  ఉంటాయని పవన్ తన లేఖలో పొందుపరిచారు. 


ఇక రజినీకాంత్ ఈ ఏడాది ప్రత్యక్ష రాజకీయాలలోకి రాబోతున్నట్లు ప్రకటించారు. ఆయన పార్టీ ప్రకటించడంతో పాటు 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయం ఆయన అభిమానుల్లో ఆనందం నింపింది. దీనితో రజినీకాంత్ త్వరగా కోలుకొని తిరిగి రావాలని ప్రార్ధనలు చేస్తున్నారు.