శుక్రవారం రోజు 66వ జాతీయ చలనచిత్ర అవార్డులని ప్రకటించారు. పలు విభాగాల్లో తెలుగు సినిమాలకు 6 జాతీయ అవార్డులు దక్కడం విశేషం. ఉత్తమ నటిగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి చిత్రానికి గాను అవార్డు సొంతం చేసుకుంది. మహానటి చిత్రంలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో ఒదిగిపోయి నటించిన సంగతి తెలిసిందే. 

ఉత్తమనటిగా జాతీయ అవార్డు గెలుచుకోవడంతో కీర్తి సురేష్ కు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ చలన చిత్ర అవార్డులపై స్పందించారు. జాతీయ పురస్కారాల్లో ఉత్తమ నటిగా ఎంపికైన కీర్తి సురేష్ గారికి నా అభినందనలు. సావిత్రి గారి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన మహానటి చిత్రంలో కీర్తి సురేష్ నటనకు అవార్డు రావడం అర్హమైనదే అని పవన్ కళ్యాణ్ తెలిపారు. 

జాతీయ అవార్డులు గెలుచుకున్న ఇతర చిత్రాలని కూడా పవన్ అభినందించారు. రంగస్థలం, చిలసౌ, అ! చిత్రాలు వివిధ విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నాయి. ఈ సందర్భంగా పవన్ వారిని కూడా అభినందించారు. ఈ స్పూర్తితో తెలుగు సినిమా భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సొంతం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు.