మెగా డాటర్ నిహారిక వివాహానికి ఇంకా కేవలం కొద్దిరోజుల సమయం మాత్రమే ఉంది. డిసెంబర్ 9వ తేదీన నిహారిక వివాహం ఘనంగా జరగనుంది. గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ చైత్యన్యతో నిహారిక వివాహం నిశ్చయం అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరై సందడి చేశారు. 

ఐతే నిహారిక నిశ్చితార్ధ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. నిహారిక నిశ్చితార్థ వేడుకకు పవన్ రాకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. అదే సమయంలో జరిగిన నితిన్ పెళ్ళికి వెళ్లిన పవన్...నిహారిక ఎంగేజ్మెంట్ వేడుకకు రాలేదు. కారణాలేమైనా కానీ కూతురు నిశ్చితార్థ వేడుకకు పవన్ రాకపోవడం ఒకింత వెలితిగా అనిపించింది. 

నిశ్చితార్ధానికి రాకున్నా, పెళ్ళికి ఎలాగైనా పవన్ వచ్చేలా నిహారిక మరియు నాగబాబు జాగ్రత్తలు తీసుకున్నారట. ఈ విషయంలో ఇప్పటికే పవన్ దగ్గర హామీ తీసుకున్నారట. పెళ్ళికి ఖచ్చితం వస్తానని పవన్ చెప్పారట. అలాగే రెండు రోజుల ముందే చేరుకొని, పెళ్లి పనులు చూసుకుంటాను అన్నారట. 

ఇక నిహారిక పెళ్లిని గ్రాండ్ గా సెట్ చేశారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ నందు గల ఉదయ్ పూర్ ప్యాలస్ నందు నిహారిక-చైతన్య వివాహం జరగనుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరగనున్న ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరుకానున్నారు. ఇక మెగా హీరోలు తమతమ చిత్రాల షూటింగ్స్ కి బ్రేక్ చెప్పి, వివాహానికి హాజరుకానున్నారు.