పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో హరిహర వీరమల్లు చిత్రం తెరకెక్కుతోంది. రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అద్భుతమైన పోస్టర్ ని రిలీజ్ చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో హరిహర వీరమల్లు చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి ఎన్నో అడ్డంకులు.. అంతకు మించిన రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ఆర్థిక సమస్యలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. చాలా కాలంగా షూటింగ్ కూడా నిలిచిపోయింది. దీనితో అభిమానులు తీవ్ర నిరాశకి గురయ్యారు.
ఫ్యాన్స్ నిరాశని దూరం చేసేలా, వారిలో పునరుత్తేజం నింపేలా హరిహర వీరమల్లు సర్ప్రైజ్ ప్యాకేజ్ తో రెడీ అయిపోయింది. రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అద్భుతమైన పోస్టర్ ని రిలీజ్ చేశారు. అలాగే రేపు సాయంత్రం 5.45 గంటలకు పవర్ గ్లాన్స్ పేరుతో ఓ పవర్ ఫుల్ వీడియో ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించటంతో అభిమానుల ఆనంద సంబరాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి.
తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ది బెస్ట్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. విజయరథంతో యుద్ధ భూమిలో కొదమ సింహంలాగా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ జరుగుతున్న టైంలో ఈ లుక్ సోషల్ మీడియాలో విస్ఫోటనమే అని చెప్పొచ్చు. ఈ పోస్టర్ లో పవన్ లుక్ చూస్తుంటే రేపు సాయంత్రం రిలీజ్ కాబోయే పవర్ గ్లాన్స్ ఇంకెలా ఉంటుందో అని అభిమానులు వెర్రెత్తిపోతున్నారు.
దర్శకుడు క్రిష్ ట్వీట్ చేస్తూ.. స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తోంది వీరమల్లు విజయరథం అంటూ పవన్ లుక్ ని వర్ణించారు. ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో జరిగే కథతో, అత్యద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా ఈ"హరిహర వీరమల్లు" సినిమా రూపొందుతోంది. ఇది ఒక లెజండరీ బందిపోటు వీరోచిత గాథ." ఇది భారతీయ సినిమాలో ఇప్పటిదాకా చెప్పని కథ. ఖచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక మరపురాని అనుభవాన్ని ఇస్తుంది. ఏ విషయంలోనూ రాజీపడని ఉన్నతస్థాయి నిర్మాణ విలువలతో భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో నిర్మాణమవుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ యాభై శాతం పూర్తయింది.
ఈ చిత్రానికి అగ్రశ్రేణి సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సంగీత బాణీలు అందిస్తుండగా, పేరొందిన సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ వి.ఎస్. కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.
