నాని కొత్త సినిమాల విషయంలో జోరు పెంచుతున్నారు. జయాపజయాలకు అతీతంగా ఆయన సినిమాలు చేస్తున్నారు. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న నానిపై పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ అసంతృప్తితో ఉండటం ఆశ్చర్యపరుస్తుంది.

నేచురల్‌ స్టార్‌ నానికి ఇటీవల కాలంలో సరైన హిట్‌ లేదు. `జెర్సీ` తర్వాత ఆయన వరుస పరాజయాలనే చవిచూశారు. `శ్యామ్‌ సింగరాయ్‌` తప్ప `నాని గ్యాంగ్‌ లీడర్‌`, `వీ`, `టక్‌ జగదీష్‌`, `అంటే సుందరానికి` చిత్రాలు డిజప్పాయింట్‌ చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు హిట్‌ కోసం `దసరా` చేస్తున్నాడు. ఈచిత్రంపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు నాని. 

అయితే నానికి క్లాసిక్‌ సినిమాల టైటిల్‌ని రిపీట్‌ చేసే అలవాటుంది. మేకర్స్ ఛాయిస్‌ కావచ్చు, నాని ఇష్టం కావచ్చు, ఏదేమైనా నాని నటించిన సినిమాల్లో చాలా వరకు ఒకప్పటి హిట్‌ చిత్రాల టైటిల్సే కావడం విశేషం. `జెంటిల్‌మేన్‌`, `మజ్ను`, `కృష్ణార్జున యుద్ధం`, `దేవదాస్‌`, `గ్యాంగ్‌ లీడర్‌` సినిమాల్లో `జెంటిల్‌మేన్‌`, `మజ్ను` ఎంతో కొంత ఆడాయి. మిగిలినవి అలనాటి క్లాసిక్స్ టైటిల్స్ ని చెడగొట్టినవే. దీంతో ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ నానిపై కోపంతో ఉన్నారట. 

మరి పవన్‌ ఫ్యాన్స్ కి, నానికి లింకేంటనే డౌట్‌ రావచ్చు, ఆ వివరాలు చూస్తే.. ప్రస్తుతం `దసరా` చిత్రంతో వచ్చే నెలలో ఆడియెన్స్ ముందుకు రాబోతున్న నాని, నెక్ట్స్ శౌర్య దర్శకత్వంలో `నాని30` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. దీంతోపాటు శైలేష్‌ కొలనుతో `హిట్‌ 3` సినిమా చేస్తున్నారు. అలాగే `మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి`(ఎంసీఏ) డైరెక్టర్‌ శ్రీరామ్‌ వేణుతో ఓ సినిమాకి కమిట్‌ అయ్యాడట నాని. దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సినిమాకి పవన్‌ కళ్యాణ్‌ క్లాసిక్‌ టైటిల్‌ని అనుకుంటున్నారట. 

పవన్‌ సూపర్‌ హిట్‌ చిత్రాల్లో `తమ్ముడు` ఒకటి. లవ్‌ స్టోరీ, బాక్సింగ్‌ ప్రధానంగా సాగే ఈ చిత్రం పవన్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. ఇప్పుడు నాని.. తాను వేణు శ్రీరామ్‌తో చేయబోయే సినిమా కోసం ఈ టైటిల్‌ని అనుకుంటున్నారట. `తమ్ముడు` టైటిల్‌ అయితే బాగుంటుందని భావిస్తున్నారట. ఈ వార్త తెలిసి ఇప్పుడు పవన్‌ ఫ్యాన్స్ ఫైర్‌ అవుతున్నారని సమాచారం. నానికి మెగా ఫ్యామిలీ టైటిల్స్ తప్ప వేరే దొరకట్లేదా అంటూ ప్రశ్నిస్తున్నారట. ఇప్పటికే `గ్యాంగ్‌ లీడర్‌` టైటిల్‌ పెట్టి దాన్ని చెడగొట్టారు, ఇప్పుడు `తమ్ముడు` వంతు వచ్చిందా? అంటున్నారట. ఇది సోషల్‌ మీడియాలో రచ్చ లేపుతుంది. 

నానికి స్వతహాగా ఓ మంచి మార్కెట్‌ ఉంది. మినిమమ్‌ గ్యారంటీ హీరో అనే ముద్ర కూడా ఉంది. ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి ఫాలోయింగ్‌ ఉన్న నటుడు కూడా. సరైన హిట్‌ పడితే నెక్ట్స్ లెవల్‌కి వెళ్తాడు. ఈ నేపథ్యంలో మెగా టైటిల్స్ పై కన్నేయడమేంటనే అసంతృప్తిని పవన్‌ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారట. `అంటే సుందరానికి` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి పవన్‌ గెస్ట్ గా వచ్చాడు. సినిమాని పవన్‌ ఫ్యాన్స్ కూడా ఎంకరేజ్‌ చేశారు. `అంత వరకు బాగానే ఉంది, కానీ ఇదేందయ్య ఇది` అంటున్నారు అభిమానులు. మరి నిజంగానే వేణు శ్రీరామ్‌ ఇది ప్లాన్‌ చేస్తున్నాడా? ఇది ఉట్టి పుకారేనా అనేది తెలియాల్సి ఉంది. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు నాని, ఈ సందర్భంగా ఈ సినిమా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఇక ప్రస్తుతం నాని `దసరా` చిత్రంలో నటించారు. ఇది మార్చి 30న విడుదల కాబోతుంది. నాని నటించిన తొలి పాన్‌ ఇండియా మూవీ ఇది. శ్రీకాంత్‌ ఓడెల అనే నూతన దర్శకుడు రూపొందించారు. కీర్తిసురేష్‌ కథానాయికగా నటించింది. తెలంగాణ సింగరేణి బ్యాక్‌ డ్రాప్‌లో ఊరమాస్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతుంది. ఇది తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.