ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు పవన్ కళ్యాణ్. అన్నట్టుగానే `ఉస్తాద్ భగత్ సింగ్` మూవీ చిత్రీకరణ పూర్తి చేశారు. ఈసందర్భంగా తన కమిట్‌మెంట్ లవెల్‌ని వేయించారు.
ఎన్నికలకు ముందే మూడు సినిమాలకు కమిట్ అయిన పవన్
పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. మాట కోసం కమిట్‌మెంట్‌తో ఉన్నాడు. కమిట్‌మెంట్‌ని పూర్తి చేశారు. ఎన్నికలకు ముందు పవన్ మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. `హరి హర వీరమల్లు`, `ఓజీ`, `ఉస్తాద భగత్ సింగ్` చిత్రాలు చేసేందుకు రెడీ అయ్యారు. అయితే సడెన్‌గా ఎన్నికలు రావడంతో సినిమాలను మధ్యలోనే ఆపేసి రాజకీయాల్లో పాల్గొనాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం కూడా అయ్యారు పవన్.
ఇచ్చిన మాటమీద నిలబడ్డ పవన్, `హరి హర`, `ఓజీ` పూర్తి
ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని వరుసగా తాను కమిట్ అయిన మూవీస్ పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికే `హరి హర వీరమల్లు` మూవీని పూర్తి చేసి విడుదల చేశారు. ప్రమోషనల్స్ లోనూ పాల్గొన్నారు. కానీ ఈ చిత్రం ఆడలేదు. ఆ తర్వాత `ఓజీ`ని పూర్తి చేశారు పవన్ ఈ మూవీ ఈ నెల 25న విడుదల కాబోతుంది. ఈ సినిమాపై భారీ హైప్ ఉంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో రికార్డు స్థాయిలో ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కలెక్ట్ అయ్యింది. మున్ముందు ఇది భారీ వసూళ్లని రాబట్టే అవకాశం కనిపిస్తుంది.
`ఉస్తాద్ భగత్ సింగ్` లో పవన్ షూటింగ్ పూర్తి
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమాని పూర్తి చేశారు పవన్. హరీష్‌శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న `ఉస్తాద్ భగత్ సింగ్` మూవీ షూటింగ్‌ని పూర్తి చేశారు. ఇందులో తన పార్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని టీమ్ ఆదివారం వెల్లడించింది. 'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం భారీ షెడ్యూల్‌ను విజయవంతంగా ముగించింది. దీంతో పవన్ కళ్యాణ్ తన భాగం చిత్రీకరణను పూర్తి చేశారు.
కమిట్‌మెంట్‌తో ఉన్న పవన్
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తీరిక లేకుండా ఉన్నప్పటికీ, సినిమా పట్ల విశేషమైన అంకితభావం, మక్కువను ప్రదర్శించారు. చిత్రీకరణ సమయంలో పవన్ కళ్యాణ్ చూపించిన నిబద్ధత, తెరపై, తెర వెలుపల కూడా ఆయన అసాధారణ వ్యక్తిగా మన్ననలు ఎందుకు అందుకుంటున్నారో మరోసారి నిరూపించింది. ఈ కీలకమైన షెడ్యూల్‌ను పూర్తి చేయడానికి నటీనటులు, సిబ్బందితో కలిసి దర్శకుడు హరీష్ శంకర్ అహర్నిశలు శ్రమించారు. టాకీ పార్ట్‌లో ఎక్కువ భాగం పూర్తి కావడం, షూటింగ్ సజావుగా సాగడం పట్ల నిర్మాతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా `ఉస్తాద్ భగత్ సింగ్`
'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాపై నెలకొన్న ఆకాశాన్ని తాకే అంచనాలను అందుకునేందుకు చిత్ర బృందం అన్ని విధాలుగా కృషి చేస్తోంది. ఈ సినిమా కోసం అత్యున్నత స్థాయి సాంకేతిక బృందం పనిచేస్తోంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ ద్వయం యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. అయనంక బోస్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా, నీతా లుల్లా కాస్ట్యూమ్స్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. కళా దర్శకుడిగా ఆనంద్ సాయి వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు.. మాస్ ప్రేక్షకులు, యాక్షన్ ప్రియులు మెచ్చేలా ఈ చిత్రాన్ని మలుస్తున్నారు. `ఉస్తాద్ భగత్ సింగ్` మూవీ చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న తరుణంలో చిత్ర బృందం త్వరలోనే నిర్మాణాంతర కార్యక్రమాలను మొదలు పెట్టనుంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. పవన్ కి జోడీగా శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పార్థిబన్, కె.ఎస్. రవికుమార్, ఎల్ బి శ్రీరామ్, రాంకీ, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్, జయ ప్రకాష్, వర్గీస్, మీర్ సర్వర్, ప్రవీణ్, టెంపర్ వంశీ, నవాబ్ షా, శ్రీరామ్, మాగంటి శ్రీనాథ్, కిల్లి క్రాంతి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
