పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ బర్త్ డేని పురస్కరించుకుని వరుసగా ఆయన నటిస్తున్న సినిమాల లుక్‌లు, అప్‌డేట్స్ ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఇప్పటికే `వకీల్‌ సాబ్‌` చిత్రానికి చెందిన మోషన్‌ పోస్టర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. దీంతోపాట క్రిష్‌ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్‌ని విడుదల చేశారు. రెడ్‌ కలర్‌ కండువ, బ్లాక్‌ షర్ట్ తో పవన్‌ ప్రీలుక్‌ అదిరిపోయేలా ఉంది. 

మరోవైపు పవన్‌ 29వ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ కూడా పరోక్షంగా ఇచ్చారు దర్శక, నిర్మాతలు సురేందర్‌రెడ్డి, రామ్‌తాళ్లూరి. తాజాగా పవన్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో రూపొందబోతున్న 28వ సినిమా అప్‌డేట్‌ ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ని విడుదల చేశారు. తాజాగా ఇది అభిమానులను, సినీ వర్గాలను షాక్‌కి, సర్‌ప్రైజ్‌కి గురి చేస్తుంది.

ఈ కాన్సెప్ట్ పోస్టర్‌ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. బ్యాక్‌ గ్రౌండ్‌లో ఇండియా గేట్‌, ఆ తర్వాత సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, సుభాష్‌ చంద్రబోస్‌ ఫోటోలున్నాయి. దీంతోపాటు ఓ లగ్జరీ బైక్‌, దానిపై పెద్ద బాలశిక్ష, గులాబి పువ్వు ఉన్నాయి. ఇవన్నీఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంటే..పోస్టర్‌లో ఉన్న క్యాప్షన్‌ మరింత ఉత్కంఠతకి గురి చేస్తుంది. ఇందులో `ఈ సారి కేవలం వినోదం మాత్రమే కాదు` అని పేర్కొన్నారు. మొత్తానికిది పీరియాడికల్‌ చిత్రమని, హరీష్‌.. పవన్‌తో ఓ భారీ కాన్సెప్ట్ తోనే సినిమా చేయబోతున్నట్టు అర్థమవుతుంది. 

వినోదంతోపాటు బలమైన సందేశాన్ని కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఈ పోస్టర్‌ పవన్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పవన్‌ నుంచి తాము ఆశించే సినిమా రాబోతుందని భావిస్తున్నారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. గతంలో పవన్‌, హరీష్‌ కాంబినేషన్‌లో `గబ్బర్‌ సింగ్‌` వంటి బ్లాక్‌ బస్టర్‌ వచ్చిన విషయం తెలిసిందే. మరోసారి వీరి కాంబినేషన్‌ రిపీట్‌ కాబోతుంది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.