పవన్ ఫ్యాన్స్ అత్యుత్సాహం.. ఆ పిల్లలను అనాధలు చేసేశారు!

pawan fans fake posts
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వినిపించిందంటే అభిమానులు ఆనందంతో ఊగిపోతుంటారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వినిపించిందంటే అభిమానులు ఆనందంతో ఊగిపోతుంటారు. పవన్ కు అనుకూలంగా ఏదైనా విషయం వచ్చిందంటే సంతోషంతో ప్రతికూలంగా ఉందంటే ఆవేశంతో ఊగిపోతూ వారి భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంటారు. అయితే ఇక్కడ పవన్ అభిమానులు గమనించాల్సిన విషయం ఏమిటంటే.. భజన చేసేవారంతా భక్తులు కాదూ.. చేయని వారు దెయ్యాలు కాదు..

ఇప్పటివరకు ఓ నటుడిగా ప్రజలను మెప్పించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి  ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాడు. వచ్చే ఏడాది ఎన్నికలలో తన జనసేన పార్టీ తరఫున పోటీచేయనున్నాడు. ఇందులో భాగంగా ఉద్దానం ప్రాంతలో పర్యటించి అక్కడ కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పోరాడుతున్నారు. ఉద్దనంలో కిడ్నీ వ్యాధుల తీవ్రతను అరికట్టాలని కేంద్రాన్ని కోరుతున్నాడు. ఇదంతా బాగానే ఉంది కానీ పవన్ అభిమానులం, భక్తులం అని చెప్పుకుంటున్న కొందరు పవన్ ఉద్దానం పర్యటనకు సంబంధించిన కొన్ని పోస్ట్ లను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అందులో నిజముంటే ఎలాంటి సమస్య ఉండదు కానీ ఒక్క క్షణం కూడా విజ్ఞతతో ఆలోచించకుండా కొన్ని పోస్ట్ లు పెట్టడం పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గిస్తుందనిపిస్తుంది.

తాజాగా పవన్ ఇద్దరు పిల్లలతో దిగిన ఫోటోను షేర్ చేసి ''ఉద్దానంలో కిడ్నీ సమస్యతో తల్లితండ్రులను కోల్పోయిన ఈ ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకొని పవన్ కళ్యాణ్ చదివిస్తున్నారని.. చేతిలో అధికారం ఉన్న మంచి చెయ్యని నాయకులు ఏ అధికారం లేకుండా తన స్వశక్తితో స్పందించే ఇటువంటి వ్యక్తికి అధికారం ఇవ్వాలని'' అన్నారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆ ఇద్దరు పిల్లలను చూసి జాలిపడ్డారు. కొందరైతే ఆర్ధిక సహాయం కూడా చేయాలనుకున్నారు.

 

తీరా చూస్తే ఆ పిల్లలు నా పిల్లలే అంటూ ఫేస్ బుక్ లో మరో పోస్ట్ కనిపించింది. సుజాత అనే మహిళ పవన్ కళ్యాణ్ ను కలిసిన సందర్భంగా తన పిల్లలతో పవన్ ను ఫోటో తీసుకుంది. ఈ ఫోటో పవన్ ఫ్యాన్స్ కు దొరకడంతో కథలు అల్లేశారు. దీంతో ఆగ్రహం చెందిన సదరు మహిళ.. ''పవన్ కళ్యాణ్ అనే నేను అనే అకౌంట్ ఎవరిదో గాని వివరాలు తెలీకుండా పోస్ట్ లు పెడుతున్నారు,మీరు పెట్టిన పోస్ట్ లో పిల్లలు మా అబ్బాయిలు..దీనికి మీరు సమాధానం చెప్పాలి.. ఏదో చెప్పాలన్న ఆత్రుత వుండొచ్చును కానీ నిజాలు తెలుసుకుని చెప్పాలి అనే విషయం మరిచిపోకూడదు'' అంటూ స్పందించారు. తల్లితండ్రులు ఉన్న ఇద్దరు పిల్లలను అనాధలు చేయడం పట్ల పవన్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి!

 

 

loader