ప్రస్తుతం సైరా నరసింహాసరెడ్డి చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రానికి కథా రచయితగా పనిచేసిన పరుచూరి గోపాలకృష్ణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలిపారు. సైరా కథని తాను, తన అన్నయ్య వెంకటేశ్వర రావు రెండు వెర్షన్స్ గా సిద్ధం చేసాం అని తెలిపారు. 

చాలా ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాల్సింది. కానీ బడ్జెట్, అదే సమయంలో చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడం లాంటి కారణాల వల్ల అప్పట్లో ఈ చిత్రం కుదరలేదు. ఇక మెగాస్టార్ రీఎంట్రీ 150వ చిత్ర సమయంలో కత్తి రీమేకా లేక సైరానా అనే డిస్కషన్ నడిచింది. రీఎంట్రీలోనే ఇంతభారీ చిత్రం వద్దని చిరంజీవి భావించారు. 

ఖైదీ నెంబర్ 150 అంచనాలకు మించి విజయం సాధించడంతో సైరా చిత్రాన్ని ధైర్యంగా ప్రారంభించారు. మా భాద్యతగా కథ రెడీ చేసి చిరంజీవి, సురేందర్ రెడ్డి చేతుల్లో పెట్టాం. ఇక కృష్ణార్జులుగా వాళ్లిద్దరూ ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలి. సైరా చిత్రానికి తాము కథ అందించామని, డైలాగ్స్ విషయంలో తమకు క్రెడిట్ అవసరం లేదని పరుచూరి అన్నారు. ఆ విషయంలో తమకు ఎలాంటి ఇగో ఫీలింగ్స్ లేవని అన్నారు. 

కథ సిద్ధం చేసే సమయంలో కొన్ని డైలాగులు కూడా రాస్తాం. వాటిని ఉపయోగించుకోవాలా లేదా అనేది దర్శకుడి నిర్ణయం. సైరా కథ సిద్ధం చేసే సమయంలో ప్రముఖ రచయిత సత్యానంద్ కూడా తన సలహాలు ఇచ్చారు. వివి వినాయక్ కూడా కథ విని సూచనలు చేశారు. బుర్రా సాయిమాధవ్ సైరా చిత్రానికి డైలాగులు అందించారు. 

ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా సైరా కథపై ఆసక్తి చూపాడు. ఏంటి అన్నయ్య ఈ చిత్రంపై ఇంత ఆసక్తి చూపుతున్నాడు.. అసలు కథ ఏంటి అని పవన్ తమని అడిగినట్లు పరుచూరి తెలిపారు.