Asianet News TeluguAsianet News Telugu

ఓటు వేయని వారికి ఆ కఠిన శిక్ష వేయాలి

 ఓటు వేసేందుకు ఆసక్తి చూపించని వారికి  బాలీవుడ్ సీనియర్ నటుడు పరేశ్ రావల్‌  చురకలు అంటించారు.

Paresh Rawal Demands Penalties For Non-Voters jsp
Author
First Published May 21, 2024, 6:35 AM IST


లోక్‌సభ ఐదో దశ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ జరుగుతుండగా.. అందులో ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు ఓటు వేశారు. వారిలో   అక్షయ్‌ కుమార్‌, షాహిద్‌ కపూర్‌, సన్యా మల్హోత్ర, జాన్వీకపూర్‌, రాజ్‌కుమార్‌ రావు తదితరులు ఉన్నారు. 

ఈ క్రమంలోనే బాలీవుడ్ సీనియర్ నటుడు పరేశ్ రావల్‌ ముంబయిలో ఓటు వేశారు. ఆ తరవాత మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు అత్యంత కీలకమైనవని, వాటి ప్రాధాన్యతను తెలుసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో ఓటు వేసేందుకు ఆసక్తి చూపించని వారికి చురకలు అంటించారు.

ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోని వారి నుంచి అధిక పన్ను వసూలు చేయడమో లేదంటే మరేదైనా శిక్ష విధించడమో చేయాలని బాలీవుడ్‌ వెటరన్‌ యాక్టర్‌ పరేశ్‌ రావల్‌ అన్నారు. లోక్‌సభ ఐదో దశ ఎన్నికల్లో భాగంగా ముంబైలోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసిన అనంతరం రావల్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటు ప్రాముఖ్యత గురించి ఆయన ప్రస్తావించారు. అనంతరం ఇదే విషయాన్ని రావల్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు.

"ప్రభుత్వం అది చేయలేదు ఇది చేయలేదని చాలా మంది కంప్లెయింట్స్ ఇస్తుంటారు. ఇవాళ మీరు ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఆ పనులు చేయకపోవడానికి మీరే బాధ్యులవుతారు. అప్పుడు ప్రభుత్వాన్ని నిందించే అధికారం ఉండదు. ఓటు వేయని వాళ్లపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఆ మేరకు కొత్త నిబంధనలు విధించాలి. ఓటు వేయని వారి నుంచి ట్యాక్స్‌ను భారీగా వసూలు చేయాలి. లేదా ఇంకేదైనా శిక్ష విధించాలి" అని రావల్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విధుల గురించి ఎప్పుడూ వాదనలు చేసే వాళ్లు తమ పౌర విధుల విషయంలో కూడా బాధ్యత తీసుకుంటే బాగుంటుందని అన్నారు. ఓటు వేసేందుకు బద్దకించే వాళ్లకు జరినామాలు అమలు చేయాలని అభిప్రాయపడ్డారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios