కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. పార్లమెంట్ లో ఈ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. దీనితో కాశ్మీర్ ఇకపై పూర్తిస్థాయిలో ఇండియాలో అంతర్భాగం కానుంది. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం పట్ల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహంతో ఉన్నారు. 

ఇండియాకు ధీటుగా జవాబివ్వాలనే క్రమంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ ఇండియాతో వ్యాపార సంబంధాలు తెంచుకుంది. తాజాగా ఇండియన్ సినిమాలపై బ్యాన్ విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పాక్ లో ప్రదర్శిస్తున్న ఇండియన్ చిత్రాల ప్రదర్శనని వెంటనే నిలిపివేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. 

పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయం అక్కడి థియేటర్ యాజమాన్యాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. పాకిస్తాన్ థియేటర్స్ కి ఇండియన్ సినిమాల ద్వారానే 70 శాతం వరకు ఆదాయం వస్తుంది. పాక్ ప్రభుత్వానికి కూడా ఈ నిర్ణయం ఆర్థికంగా దెబ్బే. 

బాలీవుడ్ చిత్రాలు పాకిస్తాన్ లో 20 కోట్ల వరకు బిజినెస్ చేస్తుంటాయి. పీకే, ధూమ్ 3, భజరంగి భాయిజాన్ లాంటి చిత్రాలు 25 కోట్ల వరకు పాక్ లో వసూళ్లు రాబట్టాయి. ఇక సల్మాన్ ఖాన్ సుల్తాన్ చిత్రం పాక్ లో అత్యధికంగా 37 కోట్లు రాబట్టింది. గతంలో పుల్వామా అటాక్ తర్వాత ఇండియన్ ఆర్మీ పీవోకే లోని జైషే మహమ్మద్ స్థావరాలపై దాడి చేసింది. ఆ సమయంలో కూడా పాకిస్తాన్ ఇండియన్ చిత్రాలని బ్యాన్ చేసింది.