ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఇండియాకు ఆస్కార్ తెచ్చిన టీమ్ కి టాలీవుడ్ అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ వేదికపై మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఆసక్తికర కామెంట్స్ చేశారు.  

ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఖ్యాతి ప్రపంచ సినిమా వేదికపై చాటింది. ఆస్కార్ గెలిచి చరిత్ర లిఖించింది. లాస్ ఏంజెల్స్ వేదికగా మార్చి 12న జరిగిన 95వ ఆస్కార్ అవార్డ్స్ లో తెలుగు సినిమా సత్తా చాటింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు కైవసం చేసుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ అవార్డ్స్ అందుకున్నారు. ఆస్కార్ వేదికపై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇది మరో అరుదైన ఘట్టం. తెలుగు సినిమా కలలో కూడా ఊహించని విషయాన్ని రాజమౌళి సాకారం చేసి చూపించారు. తెలుగు సినిమాకు ఆస్కార్ తెచ్చిన ఆర్ ఆర్ ఆర్ టీమ్ ని టాలీవుడ్ సత్కరించుకుంటుంది. నేడు ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ వేడుక పేరుతో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 

వేదికపై మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మాట్లాడుతూ... గుడిలో మూల విగ్రహాలు ఉంటాయి. అలాగే ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. మూల విగ్రహాలు బయటకు రావు కాబట్టి ఉత్సవ విగ్రహాలు బయటకు వస్తాయి. ఆస్కార్ గెలవడంలో నేను చంద్రబోస్ కేవలం ఉత్సవ విగ్రహాలు మాత్రమే. మూల విగ్రహాలు ఎవరంటే రాజమౌళి, ప్రేమ్ రక్షిత్. ఇదే విషయాన్ని గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ వేదికలపై కూడా చెప్పాము. అయితే సమయాభావం వలన అక్కడ మనసులోని భావాలు పూర్తిగా చెప్పలేదు. 

సందర్భం ఏదైనా పరిశ్రమ అంతా ఒక చోట చేరడం ఆరోగ్యకర పరిణామం. దానికి ఎంతో సంతోషంగా ఉంది. నా మొదటి సాంగ్ చెన్నైలోని ప్రసాద్ 70 ఎంఎం థియేటర్లో రికార్డు అయ్యింది. దాన్ని ఎప్పటికప్పుడు ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో డెవలప్ చేస్తూ ఉంటారు. ఆ థియేటర్ లో అడుగుపెడితే దేవాలయంలో అడుగుపెట్టినట్టు ఉంటుంది. వాటర్ బాటిల్ తీసుకెళ్లడానికి కూడా లేదు. ఆ అవకాశం ఇచ్చిన కృష్ణంరాజు, సూర్యనారాయణ రాజులకు కృతజ్ఞతలు చెప్పాలి. 

నా ఫస్ట్ సాంగ్ ప్రసాద్ 70 ఎంఎం థియేటర్లో రికార్డు చేయడం రసగుల్లా తినడం లాంటి అనుభూతి అయితే... ఆస్కార్ దాని తర్వాత టీ తాగడం వంటిది. అలా అని ఆస్కార్ ని తక్కువ చేయడం లేదు. ఆస్కార్ కంటే ఫస్ట్ సాంగ్ ప్రసాద్ 70 ఎంఎం థియేటర్లో రికార్డు చేయడం నాకు గొప్ప అనుభూతి పంచింది. ఆస్కార్ గెలిచినందుకు నాకు ఎగ్జైట్మెంట్ లేదు. 

కార్తికేయ భార్య పూజ... ఏంటి అంకుల్ మీరు పెద్ద ఎగ్జైట్మెంట్ ఫీల్ అవరేంటని అడిగింది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. మా ఆవిడ జీవితంలో ఒక్కరోజైనా రామోజీరావులా బ్రతకాలని అంటుంది. ఆయన్ని కలవడానికి వెళితే... ఆస్కార్ గెలుచుకురండి అన్నారు. అప్పుడు ఆస్కార్ గొప్పదని నాకు అనిపించింది. ఆయన కోసమైనా ఆస్కార్ గెలవాలని అనిపించింది. ప్రకటనకు కొన్ని సెకన్స్ ముందు టెన్షన్ ఫీలయ్యాను. గెలిచామని తెలిశాక నార్మల్ అయిపోయాను. 

ఆస్కార్ సమిష్టి కృషి. ఆర్ ఆర్ ఆర్ సాంగ్ కోసం ఇద్దరు హీరోలు కష్టపడ్డారు. ఉక్రెయిన్ డాన్సర్స్ కూడా గొప్పగా చేశారు. ఆర్ ఆర్ ఆర్ సాంగ్ వైరల్ అయ్యింది. పదివేల మంది ఆస్కార్ సభ్యులకు సినిమా చేరేందుకు వందకు పైగా స్పెషల్ స్క్రీనింగ్స్ వేశాము. మొత్తంగా ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఆస్కార్ వచ్చింది. మమ్మల్ని ప్రత్యేకంగా అభినందించేందుకు సభ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు... అని ముగించారు. 

YouTube video player