దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి లాంటి కళాఖండం తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రాంచరణ్ కలసి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని డివివి దానయ్య 350 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే దేశం మొత్తం ఈ చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొని ఉన్నాయి. 

1920 బ్రిటిష్ కాలం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రలో నటిస్తున్నారు. అజయ్ దేవగన్, సముద్ర ఖని, అలియా భట్ ఈ ఈచిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతటి భారీ చిత్ర పేరుని అడ్డం పెట్టుకుని కొందరు వ్యక్తులు ఘరానా మోసానికి తెరతీశారు. 

ఆర్ఆర్ఆర్ చిత్రంలో అవకాశం ఇప్పిస్తాం అని కొందరు సోషల్ మీడియా వేదికగా అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో తెలిపింది. సినిమాకి సంబంధించిన ఏ విషయాన్ని అయినా తామే అధికారికంగా తెలియజేస్తాం. ఇలా అపరిచితులు చెప్పే మాటలు విని మోసపోవద్దకు అని ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో హెచ్చరించింది. 

ఆర్ఆర్ఆర్ చిత్రం పేరుతో వచ్చే ఫేక్ కాల్స్ పై అంతా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2020 జులై 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.