చిరునవ్వుతో, నిన్నే ప్రేమిస్తే, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరీ వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయంటే అందులో త్రివిక్రమ్ డైలాగుల పాత్ర చాలా ఉంది. అప్పటివరకూ కేవలం పెన్నుతో హాస్యాన్ని చిలికిస్తూ తెర వెనుక ఉండిపోయిన త్రివిక్రమ్ మొదటి సారిగా మెగాఫోన్ పట్టుకుని “నువ్వే నువ్వే” అనే సినిమాకు దర్శకత్వం వహించారు.
నవంబర్ 7న త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులకు కానుక ఇవ్వాలని శ్రీ స్రవంతి మూవీస్ ప్లాన్ చేసింది. దర్శకుడిగా త్రివిక్రమ్ తొలి సినిమా 'నువ్వే నువ్వే'ను రీ రిలీజ్ చేస్తోంది. పుట్టిన రోజుకు మూడు రోజుల ముందు సినిమాను విడుదల చేస్తోంది. ఈ నెల (నవంబర్) 4 నుంచి 7వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో సినిమాను ప్రదర్శించనున్నారు. ఆల్రెడీ కొన్ని థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి.
చిరునవ్వుతో, నిన్నే ప్రేమిస్తే, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరీ వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయంటే అందులో త్రివిక్రమ్ డైలాగుల పాత్ర చాలా ఉంది. అప్పటివరకూ కేవలం పెన్నుతో హాస్యాన్ని చిలికిస్తూ తెర వెనుక ఉండిపోయిన త్రివిక్రమ్ మొదటి సారిగా మెగాఫోన్ పట్టుకుని “నువ్వే నువ్వే” అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. థియేటర్ లో చూడని ఈ తరానికి ఈ సినిమాని మళ్లీ అందిస్తున్నారు.
'నువ్వే నువ్వే' రీ రిలీజ్ సందర్భంగా చిత్ర నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ మాట్లాడుతూ ''మా దర్శకుడు త్రివిక్రమ్‌కు అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్ డే. 'నువ్వే నువ్వే' విడుదలై 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా స్పెషల్ షో వేసినప్పుడు వచ్చిన స్పందన నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. వెండితెరపై మళ్ళీ సినిమా చూడటం మర్చిపోలేని అనుభూతి అని చాలా మంది చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకూ ఆ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసం మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం. 2కె హెచ్‌డి ప్రింట్‌తో షోస్ వేస్తున్నాం. లిమిటెడ్ స్క్రీన్స్‌లో 'నువ్వే నువ్వే' రీ రిలీజ్ చేస్తున్నాం. త్వరలో థియేటర్ల వివరాలు వెల్లడిస్తాం'' అని చెప్పారు.
త్రివిక్రమ్ మాట్లాడుతూ ''వనమాలి హౌస్‌లో 'నువ్వే కావాలి' షూటింగ్ జరుగుతుంది. రవికిశోర్ గారు, నేను పక్కన ఖాళీ స్థలంలో నడుస్తూ మాటల మధ్యలో కథ చెప్పా. ఆయన చెక్ బుక్ తీసి ఒక అమౌంట్ వేసి ఇచ్చారు. 'నువ్వే కావాలి'కి రైటర్‌గా ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో... దాదాపుగా అంత అమౌంట్ అడ్వాన్స్‌గా ఇచ్చారు. నేను దాంతో బైక్ కొనుక్కున్నాను. అప్పటికి నేను రాసిన 'నువ్వే కావాలి' షూటింగ్‌లో ఉంది. నేను ఏం చేయగలనో తెలియదు. కానీ, నేను చెప్పిన కథ విని రవికిశోర్ గారు ఎంతో నమ్మారు. ఆయనకు నేను ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా సరిపోదు. నాలో ఉన్న రచయితను గానీ... దర్శకుడిని గానీ... నాకంటే ఎక్కువగా గుర్తించిన, ఇష్టపడ్డ వ్యక్తి రవికిశోర్ గారు. ఆయన్ను నేను చాలా ప్రేమిస్తా. గౌరవిస్తా అన్నారు.
“త్రివిక్రమ్ శ్రీనివాస్” పేరు “ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ”7 నవంబర్ 1971 న భీమవరం లో పుట్టారు. నటుడు సునీల్, త్రివిక్రమ్ ఒకే కాలేజ్ లో చదువుకున్నారు. ఆ తర్వాత సినిమా ప్రయత్నాల్లో ఉన్నప్పుడు కూడా ఇద్దరూ ఒకే రూమ్ లో ఉండేవారు. త్రివిక్రమ్ మొదట్లో టివి సీరియల్స్ కి రచయితగా పని చేశారు. మొదటి సారిగా “స్వయంవరం” అనే సినిమాకు కథా, మాటల రచయిత గా పనిచేశారు. తర్వాత సముద్రం, నువ్వే కావాలి, వంటి సూపర్ హిట్ సినిమాలకు డైలాగ్స్ రాశారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన సినిమా 'నువ్వే నువ్వే'. తరుణ్, శ్రియ జంటగా నటించారు. ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, శిల్పా చక్రవర్తి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
