ఎన్టీఆర్ బయటకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నాడు, ఇదే తనకు అవకాశంగా మలుచుకుంటున్నాడు రామ్‌చరణ్. అక్కడ మాత్రం తన హవా చూపిస్తున్నాడు. తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఇండస్ట్రీలో మంచి స్నేహితులు. ఆ స్నేహమే `ఆర్‌ఆర్‌ఆర్`లో నటించేలా చేసింది. వీరిద్దరి స్నేహం `ఆర్‌ఆర్‌ఆర్`కి ప్లస్ అవుతుందని, సినిమాలో వారి బాండింగ్ మధ్య కెమిస్ట్రీ మరింతగా పండుతుందని భావించిన రాజమౌళి ఈ సినిమాకి వారిని హీరోలుగా ఎంపిక చేశారు. సినిమాలోనూ అంతేబాగా వారి స్నేహాన్ని చూపించారు. ప్రాణస్నేహితులుగా మారి, అంతలోనే శత్రువులుగా మార్చి, చివరకు మళ్లీ స్నేహం కోసం పోరాడేలా చేశాడు జక్కన్న. ఆయన స్ట్రాటజీ బాగా పనిచేసింది. సినిమా విజయంలో అది కీలక భూమిక పోషించింది.
ఇదిలా ఉంటే `ఆర్‌ఆర్‌ఆర్` సినిమా ఇప్పుడు అంతర్జాతీయంగా అవార్డులను కొల్లగొడుతుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు నుంచి, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు, ఇటీవల హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు, ఇతర పురస్కారాలు వరించాయి. ఇప్పుడు ఆస్కార్ కోసం పోటీలో ఉంది. ఎన్టీఆర్, చరణ్ కలిసి డాన్సులు చేసిన `నాటు నాటు` పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కి నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కి నామినేట్ కావడం ఇండియన్ సినిమా చరిత్రలోనే మొదటి సారి కావడం విశేషం. మార్చి 12న ఆస్కార్ అవార్డులను ప్రకటించనున్నారు. అవార్డుపై టీమ్ అంతా నమ్మకంతో ఉన్నారు.
ఇక `ఆస్కార్` ప్రమోషన్స్ కోసం ఇటీవలే రామ్‌చరణ్, రాజమౌళి, కీరవాణి వంటి టీమ్ అమెరికా వెళ్లింది. అక్కడ `హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్` అవార్డు వేడుకలో వీరంతా పాల్గొని సందడి చేశారు. కానీ ఇందులో ఎన్టీఆర్ మిస్ అయ్యారు. తారక్ ఇంట్లో గత వారం విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తారకరత్న చనిపోయారు. 23 రోజులు అనారోగ్యంతో పోరాడి చివరకు ప్రాణాలు విడిచారు. దీంతో పెద్ద ఖర్మ వరకు తారక్ బయటకు వెళ్లలేని స్థితిలో ఉన్నారు. అందుకే ఆయన ఇటీవల అమెరికాలో జరిగిన అవార్డు వేడుకకి హాజరు కాలేకపోయారు.
ఇది రామ్‌చరణ్‌కి అవకాశంగా మారింది. అక్కడ దున్నేసే పనిపెట్టుకున్నాడు చెర్రి. అంతర్జాతీయంగా, ముఖ్యంగా హాలీవుడ్‌లో తన ఇమేజ్‌ని పెంచుకునే పనిలో పడ్డారు. అక్కడ ఇంటర్వ్యూలిస్తున్నారు. షోస్‌లో పాల్గొంటున్నారు. సినిమాలకు సంబంధించిన ఈవెంట్లలో పాల్గొంటూ అలరిస్తున్నారు. మరోవైపు తనదైన కామెంట్లతో అందరిని ఆశ్చర్యపరుస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, హాలీవుడ్‌లో సినిమాలు చేయాలనుకుంటున్నట్టు తన మనసులో మాట బయటపెట్టారు. అవకాశాల కోసం వేచి చూస్తున్నట్టు తెలిపారు.
అక్కడ తన ఇమేజ్‌ని, పాపులారిటీని పెంచే ప్రతి ఒక్క విషయాన్ని తనకు అనుకూలంగా మల్చుకుంటున్నాడు చరణ్. మరోవైపు హాలీవుడ్‌లో ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్` కి రామ్‌చరణ్ మెయిన్ ఫేస్‌లా నిలుస్తున్నారు. దీనికితోడు సరైనా పీఆర్‌ని మెయింటేన్ చేస్తున్నారు. తన ప్రతి కదలికలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులకు, ఆడియెన్స్ కి చేరేలా చేసుకుంటున్నారు. తాను కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రతి విషయానికి రియాక్ట్ అవుతున్నారు. హాలీవుడ్ ప్రముఖులకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారి మనసు దోచుకుంటున్నాడు చరణ్. ఇవన్నీ చరణ్‌కి హాలీవుడ్‌లో మంచి ఇమేజ్‌ని తీసుకువస్తున్నాయని చెప్పొచ్చు. ఈ విషయంలో ఎన్టీఆర్ వెనబడగా, చరణ్ దూకుడుమీదున్నాడు. ఎన్టీఆర్.. మార్చి 3తో ఫ్రీ అవుతాడు. ఆ తర్వాత ఆయన అమెరికా వెళ్లే అవకాశం ఉంది. తన డిజప్పియరెన్స్ లోటుని తీర్చనున్నాడని చెప్పొచ్చు.
రామ్‌చరణ్ `ఆర్‌ఆర్‌ఆర్` తర్వాత `ఆచార్య`లో మెరవగా, అది నిరాశపరిచింది. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో `ఆర్‌సీ15` చిత్రంలో నటిస్తున్నారు. కీయారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. దీంతోపాటు బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నారు చరణ్. ఇక `ఆర్‌ఆర్‌ఆర్` తర్వాత ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఏ సినిమా చేయలేదు. కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా అనేక వాయిదాల అనంతరం వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది.
