Asianet News TeluguAsianet News Telugu

టాలీవుడ్‌కి దొరస్వామి రాజు సేవలు మరువలేనివిః ఎన్టీఆర్‌, రాజమౌళి, రాఘవేంద్రరావు ఎమోషనల్‌

వి.దొరస్వామి రాజు మరణంతో చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన దొరస్వామి రాజు తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని సీఎం అన్నారు.  

ntr rajamouli and raghavendra rao condolence to doraswamy raju arj
Author
Hyderabad, First Published Jan 18, 2021, 2:05 PM IST

నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, మాజీ ఎమ్మెల్యే దొరస్వామి రాజు హఠాన్మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురయ్యింది. నిర్మాత విజయవంతమైన సినిమాలను నిర్మించడంతోపాటు, డిస్ట్రిబ్యూటర్‌గా 750 చిత్రాలకుపైగా పంపిణీ చేశారు. వీఎంసీ ఆర్గనైజేషన్స్, వీఎంసీ ప్రొడక్షన్స్, వీఎంసీ పిక్చర్స్, వీఎంసీ ఫిల్మ్స్, వీఎంసీ 1 కంపెనీ, వీఎంసీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, వీఎంసీ పిక్చర్‌ ప్యాలెస్‌ వంటి సంస్థలను ఆయన నిర్వహించారు. నిర్మాతగానే కాదు, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. నగరి ఎమ్మెల్యేగా పనిచేశారు. దీంతోపాటు టిటిడి బోర్డ్ సభ్యులుగా, ఫిల్మ్ ఛాంబర్‌ అధ్యక్షులుగా పనిచేశారు. పంపిణీదారుల మండలి అధ్యక్షులు, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేశారు. 

1978లో వీఎంసీ సంస్థని ఎన్టీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. ఇందులో సక్సెస్‌ఫుల్‌ సినిమాలతోపాటు టెలి సినిమాలు, టెలి సీరియల్స్, తమిళ డబ్బింగ్‌, హిందీ డబ్బింగ్‌ చిత్రాలను కూడా నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావుతో బ్లాక్‌ బస్టర్స్ `సీతారామయ్య గారి మనవరాలు`ని నిర్మించి విజయాన్ని అందుకున్నార. ఈ సినిమా ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డుని సొంతం చేసుకోవడమే కాదు, అనేక ఇతర జాతీయ అవార్డులను అందుకుంది. అలాగే నాగార్జున హీరోగా నిర్మించిన `అన్నమయ్య` చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. 

తన వీఎంసీ బ్యానర్‌లో నాగార్జునతో మూడు సినిమాలు, ఏఎన్నార్‌తో రెండు సినిమాలు, ఎన్టీఆర్‌తో ఒక సినిమా, శ్రీకాంత్‌, జగపతిబాబు, మాధవన్‌ వంటి వారితోనూ సినిమాలను నిర్మించారు. వీటిలో 
నాగార్జున తో `కిరాయి దాదా`, `ప్రెసిడెంట్ గారి పెళ్లాం`, `అన్నమయ్య`, జూనియర్ ఎన్టీఆర్ తో `సింహాద్రి`, `మాధవయ్య గారి మానవాడు`, `భలే పెళ్లాం`, మీనా తో `వెంగమంబ` లాంటి చిత్రాలను నిర్మించారు. వి.దొరస్వామి రాజు మరణంతో చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన దొరస్వామి రాజు తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని సీఎం అన్నారు.  దొరస్వామి రాజు మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాననుభూతిని సీఎం తెలిపారు.

ఈ వార్త తెలిసి ఎన్టీఆర్‌ స్పందిస్తూ, `దొరస్వామి రాజు ఇక లేరనే వార్త చాలా బాధాకరం. ఒక నిర్మాతగా, పంపిణీదారుడిగా, తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. `సింహాద్రి` చిత్ర విజయంలో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నా` అని చెప్పారు. 

దర్శకధీరుడు రాజమౌళి స్పందిస్తూ, `దొరస్వామిరాజు డిస్ట్రిబ్యూటర్‌గా వెయ్యికి పైగా చిత్రాలను విడుదల చేశారు. గొప్ప సినిమాలను నిర్మించారు. ఆయనతో `సింహాద్రి` సినిమాకి కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.

.దొరస్వామి రాజు బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రిలో ఈ రోజు ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన భౌతిక కాయానికి రేపు(మంగళవారం) ఉదయం 11 గంటలకు ఫిల్మ్ నగర్ లో ఉన్న మహాప్రస్థానం లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. వీరితోపాటు దర్శకులు కె.రాఘవేంద్రరావు, నిర్మాతలు ఏ.ఎం రత్నం, సూర్యదేవర నాగవంశీ వంటి ప్రముఖులు సంతాపం తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios