యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత ఏడాది అరవింద సమేత చిత్రంతో మంచి విజయం సొంతం చేసుకున్నాడు. రాంచరణ్, ఎన్టీఆర్ కలసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ ని దానయ్య దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. 

ఇక పాన్ ఇండియా చిత్రంగా విడుదలై విజయం సాధించిన కెజిఎఫ్ చిత్రంతో యష్ బాగా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం కెజిఎఫ్ 2 షూటింగ్ కూడా హైదరాబాద్ లోనే జరుగుతోంది. కెజిఎఫ్ 2లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

సంజయ్ దత్, హీరో యష్ హైదరాబాద్ లోనే ఉండడంతో ఎన్టీఆర్ వారిని తన ఇంటికి విందు కోసం ఆహ్వానించాడట. ఎన్టీఆర్ ఆతిధ్యంతో సంజయ్ దత్ ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. హీరో యష్, సంజయ్ దత్ ఇద్దరూ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. 

కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.