సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు మంచి స్నేహితులు. కానీ వారి అభిమానుల మధ్య మాత్రం అప్పుడప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటున్నాయి. తామంతా ఒక్కటే అని హీరోలు ఎంత చెప్పినా.. అభిమానులు మాత్రం ఎక్కడైనా తేడా వస్తే అస్సలు ఊరుకోరు.

తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మహేష్ పై విరుచుకుపడుతున్నారు. ఇటీవల విడుదలైన 'సర్కార్' సినిమా బాగుందని, మురుగదాస్ ట్రేడ్ మార్క్ ఫిలిం అంటూ మహేష్ బాబు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. మురుగదాస్ తో తనకున్న బాండింగ్ తో మహేష్ బాబు ఈ ట్వీట్ చేశాడని అనుకుంటే ఇప్పుడు అదే ట్వీట్ అతడికి కొత్త తలనొప్పి తీసుకొచ్చింది.

ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' లాంటి హిట్ సినిమాకి స్పందించని మహేష్ కి 'సర్కార్' సినిమాపై ట్వీట్ చేయడానికి మాత్రం టైమ్ ఉందా అంటూ అర్ధంలేని విధంగా వాదిస్తున్నారు. మహేష్ ట్వీట్ చేయడం, చేయకపోవడం ఆయన వ్యక్తిగత విషయమని దానికి ఆయన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో రాజమౌళి కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. ఆయనకి సంబంధం ఉన్న కొన్ని సినిమాలపై మాత్రమే స్పందించి పెద్ద సినిమాలపై కామెంట్ చేయకపోవడంతో ఆయనపై విమర్శలు తలెత్తాయి. అప్పటినుండి రాజమౌళి సినిమాలపై సరిగ్గా ట్వీట్లు  కూడా చేయడం లేదు. ఇప్పుడు మహేష్ కూడా అదే ఫాలో అవుతాడేమో చూడాలి!