స్వర్గీయ నందమూరి తారక రామారావు స్మారకార్థం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 100 రూపాయల నాణేన్ని విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సావాల సందర్భంగా గౌరవార్థం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

స్వర్గీయ నందమూరి తారక రామారావు స్మారకార్థం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 100 రూపాయల నాణేన్ని విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సావాల సందర్భంగా గౌరవార్థం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అనుకున్నట్లుగానే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నేడు ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. 

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా ప్లాన్ చేసిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరికి రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. దీనితో ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, నారా చంద్రబాబు నాయుడు, పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర్లు, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, గారపాటి లోకేశ్వరి, నారా బ్రాహ్మణి, ఇతర కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

అయితే అందరి తారక్ పైనే.. జూ. ఎన్టీఆర్ తన తాతగారి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరవుతాడా లేదా అనే ఉత్కంఠ సర్వత్రా ఉండేది. కానీ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి జూ.ఎన్టీఆర్ అఫీషియల్ గా హాజరు కాలేదు. 

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తనయుడిగా నందమూరి బాలకృష్ణ , కుమార్తెలు భువనేశ్వరి, పురందేశ్వరి, గారపాటి లోకేశ్వరి రాష్ట్రపతితో కలసి వేదిక పంచుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి. నందమూరి నారా కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా పలువురు టిడిపి, బీజేపీ నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, ఎంపీ రఘురామ కృష్ణరాజు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎంపీ సుజనా చౌదరి, కంభంపాటి రామ్మోహన్ రావు ఈ కార్యక్రమంలో కనిపించారు. అయితే జూ.ఎన్టీఆర్ హాజరు కాకపోవడంపై నందమూరి అభిమానుల్లో మరోసారి నిరాశ నెలకొంది.తారక్ పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

YouTube video player

ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. షూటింగ్ వల్లే తారక్ స్మారక నాణెం రిలీజ్ కి హాజరు కాలేకపోయాడనే వార్తలు వస్తున్నాయి. అయితే తారక్ తలుచుకుంటే షూటింగ్ ని ఒకరోజు వాయిదా వేయడం పెద్ద కష్టమా ? తాతగారి ప్రతిష్టాత్మక కార్యక్రమం కన్నా షూటింగ్ ముఖ్యమా ? కుటుంబ సభ్యులతో కలసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఉంటే ఎంత బావుండేది.. ఈ తరహా విమర్శలు అభిమానుల నుంచి చుట్టుముడుతున్నాయి. 

అయితే తారక్ అభిమానుల వైపు నుంచి దీనికి సమాధానం కూడా వస్తోంది. ఎన్టిఆర్ శతజయంతి ఉత్సవాలకు తారక్ ని ఆహ్వానించారా అని ప్రశ్నిస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ తారక్ ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తోందనే రూమర్స్ ని పైకి తీసుకువస్తున్నారు. బాలయ్య, ఎన్టీఆర్ మధ్య సంబంధాల గురించి కూడా చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి తారక్ హాజరు కాకపోవడం అనేది కొన్నిరోజుల పాటు పెద్దఎత్తున చర్చ జరిగే వివాదభరిత అంశమే.