మరో రెండు రోజుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 38వ బర్త్ డే జరుపుకోనున్నారు. మే 20న ఆయన బర్త్ డే నేపథ్యంలో అభిమానులు వేడుకలకు సిద్ధం అవుతున్నారు. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా భౌతికమైన వేడుకలకు అవకాశం లేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చిన్న చిన్న సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ మినహాయించి పెద్దగా సందడి ఉండకపోవచ్చు. ఐతే సోషల్ మీడియాలో మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ చేయనున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ బర్త్ డే ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. 


గత ఏడాది మాదిరే ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఆర్ ఆర్ ఆర్ నుండి చెప్పుకోదగ్గ అప్డేట్ ఉండకపోవచ్చు. కానీ చరణ్ బర్త్ డే నాడు అల్లూరి సీతారామ రాజుగా ఆయన లుక్ విడుదల చేశారు. అలా ఆర్ ఆర్ ఆర్ నుండి కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ తో ప్రత్యేక బర్త్ డే విషెస్ పోస్టర్ విడుదల చేసే అవకాశం కలదు. ఐతే ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆసక్తికర అప్డేట్ ఒకటి ఉంది. 


ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మూవీ ఉంటుందని ఎప్పటి నుండో పుకారు నడుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ కి సన్నాహాలు చేస్తున్నారనేది వినికిడి. కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మీడియాలో కూడా దీనిపై ఊహాగానాలు నడుస్తున్నాయి. మరి ఇదే కనుక జరిగితే ఫ్యాన్స్ కోరిక నెరవేరినట్లు అవుతుంది. 


ఇక ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ నుండి కొరటాల మూవీ రానుంది. పాన్ ఇండియా లెవెల్ లో భారీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా ఎంపికయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ బర్త్ డే నాడు దీనిపై కూడా స్పష్టత వచ్చే సూచనలు కలవు.