బన్నీ, బాలయ్య కాదు... ఆ క్రేజీ హీరోతో బోయపాటి మూవీ?
దర్శకుడు బోయపాటి శ్రీను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మూవీ చేస్తున్నట్లు ప్రకటన వచ్చిన నేపథ్యంలో బన్నీ, బాలకృష్ణ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే వారెవరూ కాదంటూ మరో హీరో పేరు వినిపిస్తోంది
ఇటీవల దర్శకుడు బోయపాటి శ్రీను-అల్లు అరవింద్ కలిశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బోయపాటి శ్రీను మూవీ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయితే హీరో ఎవరనే సమాచారం పంచలేదు. దీంతో పలు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా చేస్తున్నాడని ఒక ప్రచారం జరిగింది. అలాగే అల్లు అర్జున్-బోయపాటి కాంబో మరోసారి రిపీట్ కానుందన్న వార్త హల్చల్ చేసింది.
వీటన్నింటికీ మించి.. అఖండ 2 అంటూ మరోవాదన తెరపైకి వచ్చింది. 2021లో విడుదలై భారీ విజయం సాధించిన అఖండ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారని కథనాలు వెలువడ్డాయి. దీంతో ఫ్యాన్స్ లో ఆసక్తి ఏర్పడింది. బాలయ్య-బోయపాటి కాంబో అంటే హిట్ ఖాయం. మూడు హిట్ చిత్రాలతో వారు హ్యాట్రిక్ పూర్తి చేశారు. అఖండ 2 పట్టాలెక్కితే పండగే అని నందమూరి ఫ్యాన్స్ భావించారు.
అయితే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బోయపాటి చేసే చిత్ర హీరో బన్నీ, బాలయ్య, సూర్యలలో ఎవరూ కాదట. విజయ్ దేవరకొండతో బోయపాటి మూవీ చేస్తున్నారట. ఈ మేరకు లేటెస్ట్ న్యూస్ ఒకటి పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. అయితే బోయపాటి శ్రీను మాస్ డైరెక్టర్. హీరో ఎవరైనా ఆయన సబ్జక్ట్స్ అదే తరహాలో ఉంటాయి. కత్తి పట్టి వందల మందిని నరకడం వెరీ కామన్. మరి అలాంటి దర్శకుడితో విజయ్ దేవరకొండ వంటి క్లాస్, రొమాంటిక్ హీరో సెట్ అవుతాడా అనే సందేహాలు ఉన్నాయి.
బోయపాటి-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో నిజంగా మూవీ ఉంటే... అది ఊహించని పరిణామమే. ఈస్ట్ వెస్ట్ లాంటి ఆ ఇద్దరి కాంబోలో వచ్చే మూవీ ఎలా ఉంటుందో చూడాలి. బోయపాటి గత చిత్రం స్కంద నిరాశపరిచింది. ఇక విజయ్ దేవరకొండ పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ మూవీ చేస్తున్నాడు. అలాగే గౌతమ్ తిన్ననూరి తో ఒక మూవీ చేస్తున్నాడు.