మొత్తానికి నితిన్ వివాహ తేదీ ఫిక్సైంది. కరోనా సమయంలో మొదట వద్దనుకున్నారు కానీ ..ఇప్పుడిప్పుడే దాని ప్రభావం ప్రపంచంపై పోయేటట్లు కనపడకపోవటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జాగ్రత్తలు తీసుకుంటూ వివాహ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు నితిన్ తల్లి,తండ్రులు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రియల్  16 న మొదట దుబాయి లో ఘనంగా డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకుందామనుకున్నారు. కానీ లాక్ డౌన్ వారి ప్రయత్నాలన్ని వమ్ము చేసింది. దాంతో ఇక లాభం లేదని జూలై 26న ఫామ్ హౌస్ లో వివాహం చేసుకుందామని ముహూర్తం నిర్ణయించుకున్నారు.

వివరాల్లోకి వెళితే...నాగర్ కర్నూల్‌కు చెందిన‌ షాలినితో నితిన్ చాలాకాలంగా ప్రేమ‌లో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ ప్రేమ‌ను పెళ్లి పీట‌లెక్కించేందుకు ఫిబ్ర‌వ‌రి 15న హైద‌రాబాద్‌లో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఏప్రిల్‌లో పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. అన్నీ క‌లిసొస్తే నితిన్‌ ఈపాటికే ఓ ఇంటివాడ‌య్యేవాడు. కానీ క‌రోనా మ‌హమ్మారి వారి ప్లాన్‌లు ర‌ద్ద‌ు చేసింది.

తొలుత‌ డిసెంబ‌ర్‌లో పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ తాజా స‌మాచారం ప్ర‌కారం జూలై 26న వివాహం జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌ట్లో క‌రోనా స‌మ‌స్య ముగిసే సూచ‌న‌లు లేక‌పోవ‌డంతో పెళ్లి ప‌నులు కూడా మొద‌లుపెట్టిన‌ట్లు తెలుస్తోంది. కానీ ఈ సారి ప్లాన్‌ను విదేశాల నుంచి హైద‌రాబాద్‌కు మార్చారు. న‌గ‌ర శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో నితిన్ వివాహం జ‌ర‌గ‌నుంది. పరిస్దితులు అన్నీ చక్కబడ్డాక ఇండస్ట్రీలోకి రిసెప్షన్ ఏర్పాటు చేస్తారు.ఇక‌ ఈ విష‌యాన్ని నితిన్‌, షాలినీ కుటుంబ స‌భ్యులు అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.

షాలినీని నితిన్ ఎప్పుడు కలిసారంటే...‘ఇష్క్‌’ (2012) సినిమా జరుగుతున్న సమయంలో  కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా కలిశాం. చూడగానే నా మనసుకు తను బాగా నచ్చింది. ముందు ఫ్రెండ్స్‌లానే ఉన్నాం.  కొంత సమయం తరవాత ఒకరినొకరు అర్థం చేసుకున్నాక నెక్ట్స్‌ స్టెప్‌ తీసుకున్నాం. గత ఏడాది ఇంట్లోవాళ్లకు చెప్పాం. ఇంట్లోవారికి చెప్పగానే రెండు కుటుంబాలవారు ఎటువంటి అభ్యంతరం లేకుండా అంగీకరించారు. చాలా సంతోషపడ్డాం అన్నారు.