హీరో నితిన్‌.. పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని అనే విషయం తెలిసిందే. ప్రతి సినిమాలో ఆయన ప్రస్థావన ఉండేలా చూసుకుంటారు. అదే సమయంలో ప్రతి ఈవెంట్‌లోనూ పవన్‌ గురించి మాట్లాడుతుంటారు. తాజాగా నితిన్‌ నటించిన `రంగ్‌దే` సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. త్రివిక్రమ్‌ గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి మాట్లాడారు నితిన్‌. మధ్యలో పవన్‌ ఫ్యాన్స్ `పవన్‌` అంటూ, `వకీల్‌సాబ్‌` అంటూ కామెంట్లు చేశారు. గట్టిగా అరుస్తున్నారు. 

దీంతో సహనం కోల్పోయిన నితిన్‌ వెంటనే స్పందించి సెటైర్లు వేశాడు. `పవన్‌ కళ్యాణ్‌ గారి సినిమా `వకీల్‌సాబ్‌` ఏప్రిల్‌ 9న విడుదల. నేను కూడా వెయిటింగ్‌, అందరం కలిసి చూద్దాం` అంటూ కాస్త చిరాకుగా, అసహనంతో చెప్పాడు. దీనికి ఫ్యాన్స్ ఖుషీ అయినా నితిన్‌ ఆ సందర్బంలో ఫ్యాన్స్‌ అరవడం వల్ల వచ్చిన చికాకుని మాత్రం పరోక్షంగా చూపించారు. ఆ తర్వాత వారిని కూల్‌ చేసే కార్యక్రమం చేపట్టారు. పవన్‌ కళ్యాణ్‌పై, త్రివిక్రమ్‌పై ప్రశంసలు కురిపించారు. ఆకాశానికి ఎత్తేశాడు. ఇండస్ట్రీలో నాకు రెండు కళ్లు పవన్‌, త్రివిక్రమ్‌ అని చెప్పారు. 

ఇంకా చెబుతూ, `ఈ చిత్రంలో నా వయసు 24 ఏళ్లు. నిజంగా నా వయసు 36 ఏళ్లు. దర్శకుడు కథ చెప్పినప్పుడు నా వయసుని జనాలు అంగీకరిస్తారా అన్న అనుమానం వచ్చింది. పీసీ శ్రీరామ్‌ డిఓపీ అనగానే ఆయన బాగా చూపిస్తారనే నమ్మకంతో ధైర్యం వచ్చింది. డీఎస్‌పీ డైమండ్స్‌ లాంటి పాటలిచ్చారు. దర్శకుడితో పన్నెండేళ్ల పరిచయం ఉన్నా మా ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ఇప్పటికి కుదిరింది. చాలా సెన్సిబుల్‌గా ఈ కథను తెరకెక్కించాడు. ఈ బ్యానర్‌లో మూడో సినిమా ఇది. నేను ఫ్లాప్‌లో ఉన్న ప్రతిసారీ ఈ బ్యానర్‌ హిట్‌ ఇస్తుంది. సెంటిమెంట్‌గా చూస్తే ఈ సినిమా కూడా హిట్‌ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో నా రెండు కళ్లు ఎవరంటే ఒకరు పవన్‌కల్యాణ్‌గారు, రెండు త్రివిక్రమ్‌గారు. ఈ ఇద్దరూ నా వెనకున్నారు. అదే నా ధైర్యం అదే నా దమ్ము` అని అన్నారు.

తన హీరోయిన్‌ కీర్తిసురేష్‌పై ఆయన కామెంట్లు చేశారు. కీర్తి కనిపించడంలేదని, ప్రమోషన్‌కి రావడం లేదని, అందుకు మిస్సింగ్‌ అని ట్వీట్‌ పెట్టానని చెప్పాడు. ఈ చిత్రంలో ఆమె పాత్ర గురించి చెబుతూ, `కీర్తి సురేశ్‌ అనగానే 'మహానటి' గుర్తొస్తుంది. ఈ సినిమాలో మాత్రం ఆమె మహా నాటు, మహా నాటీ. ఈ కథకు ఆమె పెద్ద ఎసెట్‌` తెలిపాడు నితిన్‌. దీనికి కీర్తిసురేష్‌ నవ్వడం విశేషం.