సినీ ఇండస్ట్రీలో విషాదాలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో స్టార్ వెండితెర నుంచి రాలిపోయింది. అజయ్‌ దేవగన్‌ హీరోగా దృశ్యం సినిమాను తెరకెక్కించిన దర్శకుడు నిశికాంత్ కామత్‌ ఈ నెల 11న తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆయన అనారోగ్యం తీవ్రం కావటంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి లివర్‌ సిరోసిస్‌ కారణమని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఈ రోజు ఉదయమే నిశికాంత్ మరణించినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ సమయంలో ఆయన ప్రాణాలతోనే ఉన్నారని హీరో రితేష్ దేశ్‌ముఖ్ ట్వీట్ చేయటంతో గంధరగోళ పరిస్థితి ఏర్పడింది. మీడియా సంస్థలు నిశికాంత్ మరణించినట్టుగా ప్రకటించిన తరువాత ఆయన బతికే ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ సమయంలో ఆయన లైఫ్ సపోర్ట్ మీద ఉన్నారని, ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.

నిశికాంత్ మృతితో బాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. దృశ్యం సూపర్ హిట్ అయిన తరువాత నిశికాంత్‌, అభిషేక్‌ బచ్చన్‌ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేశాడు. అయితే ఈ సినిమా పట్టాలెక్కకుండానే ఈ దర్శకుడు తుదిశ్వాస విడిచాడు. నిశికాంత్ ఎవనో ఒరువన్‌, మదారి, ముంబై మేరీ జాన్‌, ఫోర్స్‌, రాఖీ హ్యాండ్సమ్‌ లాంటి సినిమాలకు పనిచేశాడు.

ఇటీవల దృశ్యం సినిమా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సౌత్‌లో సూపర్‌ హిట్ అయిన ఈ సినిమాను అదే పేరుతో బాలీవుడ్‌లో అజయ్‌ దేవగన్‌, శ్రియ, టబు ప్రధాన పాత్రల్లో రీమేక్‌ చేశాడు నిశికాంత్. ఈ సినిమా 2015లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఆయన మృతికి బాలీవుడ్‌ సినీ పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.