ప్రముఖ గాయని నేహా కక్కర్ సోషల్ మీడియాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 'ఇండియన్ ఐడల్' కార్యక్రమంలో పాల్గొన్న విభోర్ పరాషర్ అనే కంటెస్టంట్ తో నేహా కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారని.. వీరిద్దరూ కలిసి కచేరి కార్యక్రమాలకు వెళ్తున్నారని వార్తలు ప్రచురిస్తున్నాయి.

దీనిపై స్పందించిన నేహా ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించకండి అంటూ వేడుకున్నారు. ఈ పోస్ట్ రాస్తున్నప్పుడు శారీరకంగా, మానసికంగా కుంగిపోయి ఉన్నాను.. కానీ నేను మాట్లాడి తీరాల్సిందేనని చెబుతూ.. ఇలాంటి వార్తలు సృష్టిస్తున్న వారు నేను ఒకరికి కూతురునని, సోదరినని గ్రహించరు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ఇంతకాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఎంతో కష్టపడినట్లు.. తన పనితనంతో కుటుంబాన్ని గర్వపడేలా చేశానని.. అలాంటప్పుడు వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదని చెప్పింది. తనొక సెలబ్రిటీ అయినప్పటికీ ముందుగా మనిషిగా పుట్టానని, వేరొకరితో తనకు సంబంధాలున్నాయంటూ తప్పుడు వార్తలు సృష్టించి మరింత కుంగిపోయేలా చేయకండి అంటూ రిక్వెస్ట్ చేసింది.

మీ సోదరి గురించి, కూతురి గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారా..? నేను ఆత్మహత్య చేసుకునేలా చేయకండి అంటూ మండిపడింది. ప్రస్తుతం తన టైం బాగాలేదని.. కానీ ఎప్పుడూ ఇలాగే ఉండదని చెప్పింది. త్వరలోనే కోలుకుంటానని వెల్లడించింది.