బాలకృష్ణ హీరోగా నటిస్తున్న `ఎన్బీకే108` చిత్ర షూటింగ్‌ త్వరలో మళ్లీ స్టార్ట్ కాబోతుంది. ఇందులో యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీలా కూడా పాల్గొనబోతుంది. ఇద్దరి మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. 

బాలకృష్ణ బ్యాక్‌ టూ బ్యాక్‌ సక్సెస్‌లతో జోరు మీదున్నారు. `అఖండ`, `వీర సింహారెడ్డి` ఆయనకు కెరీర్‌ పరంగా పెద్ద బూస్ట్ నిచ్చాయి. మరోవైపు `ఆహా`లో చేసిన `అన్‌ స్టాపబుల్‌` టాక్‌ షో సైతం సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. టాక్‌ షోలకే అమ్మ మొగుడిలా నిలిచింది. ప్రస్తుతం బాలయ్య.. కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడితో `ఎన్బీకే108` చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్‌ ప్రధానంగా వినోదం మేళవింపుతో ఈ చిత్రం సాగనుందని తెలుస్తుంది. 

ఇప్పకే ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమై కొంత భాగం చిత్రీకరణ జరుపుకుంది. ఫిబ్రవరి ఎండింగ్‌లో మరో షెడ్యూల్‌ ప్రారంభం కావాల్సి ఉండగా, తారకరత్న కారణంగా వాయిదా పడింది. అప్పటకే తారకరత్న అనారోగ్యం బారిన పడినప్పట్నుంచి బాలయ్య ఈ సినిమా షూటింగ్‌ మానేసి ఆయనకు ట్రీట్‌మెంట్‌కి సంబంధించి అన్నీ తానై చూసుకున్నారు. ఇక ఇప్పుడు తిరిగి షూటింగ్‌ స్టార్ట్ చేస్తున్నారు. ఈ నెల తొమ్మిది నుంచి కొత్త షెడ్యూల్‌ స్టార్ట్ చేయబోతున్నారట. అయితే ఇందులో శ్రీలీలా కూడా నటించబోతున్నట్టు తెలుస్తుంది. 

బాలకృష్ణ ఇందులో డబుల్‌ రోల్‌ చేస్తారని సమాచారం. శ్రీలీలా కీలక పాత్రలో కనిపించనుంది. అయితే ఆమె బాలయ్యకి కూతురు తరహా పాత్రలో కనిపించబోతుందని టాక్‌. ఇక బాలయ్యకి జోడీగా కాజల్‌ నటిస్తుంది. ఇక ఇప్పుడు ప్రారంభమయ్యే కొత్త షెడ్యూల్‌లో శ్రీలీలా కూడా పాల్గొనబోతుందట. బాలయ్య, శ్రీలీలా మధ్య కీలక సన్నివేశాలు షూట్‌ చేయబోతున్నారట. మూడు రోజుల పాటు వీరి మధ్య షూటింగ్‌ ఉంటుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే `వీరసింహారెడ్డి`లో చెల్లి పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్‌ కుమారే నెగటివ్‌ రోల్‌ చేసి మెప్పించింది. పెద్ద బాలయ్యని చంపేసింది. అలాగే ఇప్పుడు అనిల్‌ రావిపూడి చిత్రంలోనూ ఓ లేడీ విలన్‌ ఉండబోతుందట. ఆ పాత్రలో బాలీవుడ్‌ హాట్‌ బాంబ్‌ నోరా ఫతేహి నటించబోతున్నట్టు సమాచారం. ఆమె పాత్ర చాలా కీలకంగానే కాదు, శక్తివంతంగానూ ఉంటుందట. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. దీన్ని ఈ దసరాకు విడుదల చేయాలనుకుంటున్నారు. కానీ ఆలస్యం అయ్యే ఛాన్స్‌ ఉంది.