నయనతార - విఘ్నేశ్ శివన్ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. ఈ కోలీవుడ్ జంట వివాహానికి ఇంకా మూడు రోజులే సమయం ఉంది. అయితే తమ వివాహా వేడుకను అభిమానులు కూడా వీక్షించేందుకు అదిరిపోయే ప్లాన్ వేసిందీ జంట.
లేడీ తలైవా నయనతార (Nayanthara), ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్ (Vignesh Sivan) ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ స్టార్ కపుల్ గా మారబోతున్నారు. ఈ మేరకు గతంలోనే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట నెల రోజుల నుంచి తమ వివాహా వేడుకకు సిద్ధం అవుతున్నారు. ఈ సందర్బంగా పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లును పూర్తి చేస్తున్నారు. జూన్ 9న తమిళ నాడులోని మహాబలిపురంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఈ కోలీవుడ్ జంట ఒక్కటి కాబోతున్నట్టు సమాచారం. హిందూ సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరగనుంది.
ఇటీవల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ను తమ వెడ్డింగ్ కు ఆహ్వనించారు. ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం శుభలేఖను కూడా అందించారు. అలాగే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ను కూడా పెళ్లికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. వీరితోపాటు కోలీవుడ్ నుంచి కమల్‌హాసన్, రజినీ కాంత్, చిరంజీవి, అజిత్, విజయ్, సూర్య, కార్తీలతో సహా పలువురు సినీ ప్రముఖులు కూడా పెళ్ళికి హాజరుకానున్నట్టు తెలుస్తోంది. అయితే కోలీవుడ్ లో జరుగుతున్న స్టార్ వెడ్డింగ్ కావడంతో వేడుకను ఓటీటీలో ప్రసారం చేసేందుకు ప్లాన్ చేశారంట.
తాజాగా అందిన సమాచారం ప్రకారం.. వీరి మొత్తం వివాహ వేడుకను ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లో చిత్రీకరించి ప్రసారం చేస్తారనే టాక్ వినిపిస్తోంది. వీరి పెళ్లికి సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ (Netflix) సంస్థ కొనుగోలు చేసిందని చెబుతున్నారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ పెళ్లిని మొత్తం డాక్యుమెంటరీ స్టైల్‌లో చిత్రీకరిస్తారని, ఆ తర్వాత స్ట్రీమ్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే, భారతీయ చిత్ర పరిశ్రమలో ఓటీటీలో ఓ స్టార్ జంట పెళ్లిని ప్రసారం చేయడం ఇదే తొలిసారి అవుతుంది. కానీ దీనిపై ఇంకా అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు.
