బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ భార్య ఆలియా నవాజుద్దీన్ విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలియజేశారు. పిల్లల భవిష్యత్ కోసం, తన కోసం ఆయనతో కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు మీడియాకు తెలియజేశారు. గత ఏడాది మే నెలలో భర్త నవాజుద్దీన్ పై ఆలియా తీవ్ర ఆరోపణలు చేశారు. పదేళ్ల వివాహబంధంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. అలాగే నవాజుద్దీన్ బ్రదర్ కూడా తనని వేధించినట్లు ఆరోపించారు. అలాగే విడాకులు కోరుకుంటూ నవాజుద్దీన్ కి నోటీసులు పంపారు. 

దాదాపు ఏడాది తరువాత ఆలియా తన మనసు మార్చుకున్నారు. కోవిడ్ తన కళ్ళు తెరిపించిందని.. కష్ట సమయాల్లో తన పిల్లలతో పాటు తనని కూడా నవాజుద్దీన్ ఆదుకున్నారు అని ఆలియా తెలియజేశారు. మా మధ్య విబేధాలు మేము పక్కన పెట్టాం. నేను ఒత్తిడిలో ఉన్న ప్రతిసారి ఆయన తోడుగా నిలిచారని అలియా వెల్లడించారు. మా పిల్లలకు మేము కావాలి, మేము కలిసి ఉండడమే వారికి సంతోషం, అందుకే విడిపోవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను అన్నారు. 

ఇక ఇదే విషయంపై నవాజుద్దీన్ సైతం స్పందించారు. పిల్లలు యాని, శోరా భవిష్యత్ నే నా ప్రాధాన్యత. ఇప్పటికీ అలియా వాళ్ళ అమ్మనే. అలాగే మేము కలిసి పదేళ్లు కాపురం చేశాం. విషయం ఏదైనా నా సపోర్ట్ ఆమెకు ఎప్పుడూ ఉంటుందని అన్నారు. కలిసి ఉండడానికి ఇద్దరూ సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో వీరి పెళ్లి బంధం కొనసాగనుందని తెలుస్తుంది.