కరోన మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ముఖ్యంగా మనదేశంలో వైరస్‌ ఉదృతి తీవ్ర స్థాయిలో ఉంది. గత నెల రోజులుగా ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న దేశం భారతే కావటం కలవరం కలిగిస్తోంది. రోజు దాదాపు 1000 మంది వైరస్‌ కారణంగా మృతి చెందుతున్నారంటేనే దేశంలో వైరస్‌ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలను కూడా వదిలిపెట్టడం లేదు కరోన.

ఇప్పటికే వైరస్‌ బారిన పడి ప్రముఖులు మృతి చెందిన వార్తలు కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా సినీ రంగంలో ఈ మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంది. టాలీవుడ్‌లో ఇప్పటికే ఇద్దరు నిర్మాతలు కరోనా కారణంగా మృతి చెందగా తాజాగా ఓ ఆర్ట్‌ డైరెక్టర్‌ కూడా కరోనాకు బలయ్యాడు. 5 సార్లు నేషనల్‌ అవార్డు సాధించిన కళా దర్శకుడు నరేష్‌ గురువారం కరోనా కారణంగా తుది శ్వాస విడిచాడు.

నరేష్‌ పని చేసిన చివరి చిత్రం యాంకర్ ప్రదీప్‌ హీరోగా తెరకెక్కిన `30 రోజుల్లో ప్రేమించటం ఎలా`. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్‌ డౌన్‌ కారణంగా రిలీజ్ వాయిదా పడింది. థియేటర్లు ఓపెన్‌ అయిన తరువాత సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.