`పొలిమేర` సినిమాని వదులుకున్న యంగ్ హీరో.. `నరకాసుర` ఆ లోటు తీర్చుతుందా?
ప్రస్తుతం `నరకాసుర` చిత్రంతో రాబోతున్న యంగ్ హీరో రక్షిత అట్లూరి.. `పొలిమేర` చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. రెండు ఒకేసారి రావడంపై స్పందించారు.

`పలాస` చిత్రంతో హీరోగా ఆకట్టుకున్నాడు యంగ్ హీరో రక్షిత్ అట్లూరి. ఇందులో అతని నటన అందరిచేత ప్రశంసలు కురిపించింది. ఆ ఊర్లో అగ్రవర్ణాల వారి ఆధిపత్యంపై దళిత వర్గానికి చెందిన యువకుడు చేసే పోరాటం నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం విశేష ప్రశంసలందుకుంది. రా అండ్ రియలిస్టిక్ మూవీగా ఆదరణ పొందింది. ఆ తర్వాత చాలా గ్యాప్‌తో ఇప్పుడు `నరకాసుర` చిత్రంలో నటిస్తున్నాడు రక్షిత్ అట్లూరి. ఈ సినిమా ఈనెల(నవంబర్ 3)న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా రక్షిత్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
ప్రస్తుతం చిన్న చిత్రాల్లో క్రేజ్ నెలకొన్న మూవీస్‌లో `పొలిమేర2` ఒకటి. ఈ శుక్రవారమే ఈ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. ఇందులో సత్యం రాజేష్ హీరోగా నటించాడు. అయితే ఆ పాత్ర కోసం ముందుగా రక్షిత్‌నే అడిగారట. ఆ విషయాన్ని వెల్లడించాడు. `నరకాసుర` మూవీ చేసే సమయంలోనే `పొలిమేర`లో నటించే ఆఫర్ వచ్చిందట. కానీ ఇందులో తన గెటప్ వల్ల మరే సినిమాని ఒప్పుకోలేకపోయాను అని తెలిపారు. ఆ సినిమా చేస్తే తనకు మరో ఇమేజ్ వచ్చేదని ఆయన తెలిపారు.
`నరకాసుర`లో తన గెటప్ ప్రత్యేకంగా ఉంటుందని, అందుకే ఈ చిత్ర షూటింగ్ సమయంలో మరే సినిమాని చేయలేదని తెలిపారు. అయితే కరోనా, దర్శకుడికి యాక్సిడెంట్ వంటి ఇతర కారణాలతో ఈ చిత్రం డిలే అయ్యిందన్నారు. `కథపరంగా ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో షూటింగ్ చేశాం. మధ్యలో రెండు సార్లు కోవిడ్ వేవ్స్ వచ్చాయి. దాంతో ఆర్టిస్టుల కాంబినేషన్స్ కు డేట్స్ కుదరలేదు. ఏడాది అనుకున్న సినిమా షూటింగ్ కే రెండున్నర సంవత్సరాల టైమ్ తీసుకుంది. మా డైరెక్టర్ గారికి యాక్సిడెంట్ అయి చేయి కోల్పోవడం కూడా డిలేకు కారణం అయ్యింది.
`నరకాసుర` మూవీ ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లోని ఓ కాఫీ ఎస్టేట్ నేపథ్యంలో సాగుతుంది. నేను లారీ డ్రైవర్ శివ అనే క్యారెక్టర్ లో నటించా. నాజర్ గారు కాఫీ ఎస్టేట్ సూపర్ వైజర్ క్యారెక్టర్ చేస్తున్నారు. నేను ఆయన దగ్గర పనిచేసే డ్రైవర్ కమ్ పెప్పర్ హార్వెస్టర్ గా కనిపిస్తాను. నా గత సినిమా `పలాస`లో దళితులకు సంబంధించిన సమస్యలు చూపించినట్లే `నరకాసుర` సినిమాలో హిజ్రాలకు సంబంధించిన పాయింట్ ఒకటి తీసుకున్నాం. కథలో ఇదొక అంశం మాత్రమే. సినిమా అంతా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉంటుంది. ఈ ట్రాన్స్ జెండర్స్ అంశం కథలో ఒక సంఘర్షణకు కారణంగా నిలుస్తుంది. ఈ మూవీలో నరకాసుడికి సంబంధించిన అంశాలేవీ ఉండవు. టీజర్ లో చూపించినట్లు రాక్షసుల్ని చంపాలంటే మనం అంతకంటే చెడ్డగా ఉండాలి అనే పోలికను తీసుకుని టైటిల్ పెట్టుకున్నాం.
గత మూడు నెలలుగా ప్రతి వారం మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ నెల 3వ తేది మా సినిమా రిలీజ్ కు మంచి డేట్ అనుకున్నాం. ఈ సినిమాని మొదట్నుంచే పాన్ ఇండియా రిలీజ్ అనుకున్నాం. కానీ తెలుగులో రిలీజ్ అయ్యాక ఒకటి రెండు వారాల గ్యాప్ తర్వాత ఇతర భాషల్లో రిలీజ్ చేస్తాం. నెక్ట్స్ `శశివదనే`, `ఆపరేషన్ రావణ్` పోస్ట్ ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి. శశివదనే డిసెంబర్ రిలీజ్ అనుకుంటున్నాం` అని తెలిపారు. మరి రక్షిత్‌కి `పొలిమేర` ని మిస్ చేసుకున్న లోటుని `నరకాసుర` తీర్చుతుందా అనేది చూడాలి. ఇందులో యాదృశ్చికమేంటంటే, `పొలిమేర` రెండో భాగం, తన సినిమా ఒకే రోజు రిలీజ్ కాబోతుండటం. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా నటిస్తున్న `నరకాసుర` చిత్రానికి సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించగా, సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించారు.