ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తమ్ముడు రామమూర్తి నాయుడిని పట్టించుకోకుండా దూరం పెట్టారని వైసీపీ నేత, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె 
శ్రీనివాసరావు చేసిన ఆరోపణలపై నటుడు నారా రోహిత్ ఫైర్ అయ్యారు.

మీ రాజకీయ ప్రయోజనాల కోసం మా మధ్య విబేధాలు సృష్టించకండి అంటూ ఓ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎలా చూసుకుంటున్నారో పెదనాన్న(చంద్రబాబు) మమ్మల్ని కూడా అలానే చూసుకుంటున్నారని చెప్పారు. రామలక్ష్మణుల్లా కలిసి ఉండే మా పెదనాన్న, నాన్నల మధ్య విబేధాలు ఉన్నాయని చెప్పడం బాధాకరమని అన్నారు.

స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం అన్నదమ్ముల మధ్య విబేధాలు సృష్టించడం తప్పని అన్నారు. నారా పేరుని నిలబెట్టడానికి తమ కుటుంబం నుండి ఒక్కరు చాలని, ఆ కారణంగానే క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నామని అన్నారు.

పెదనాన్న తమ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారన్న వాదనలో నిజం లేదని, రాత్రింబవళ్లు శ్రమించి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ఏవిధంగా చూసుకుంటున్నారో.. మమ్మల్ని అదేవిధంగా చూసుకుంటున్నారో అన్నారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగాలేని కారణంగా ఆయన ఇంటికే పరిమితమయ్యారని చెప్పారు.

రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొలేకే వ్యక్తిగత విషయాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.