`అంటే సుందరానికీ` .. నాని నటిస్తున్న చిత్ర టైటిల్‌ ఇది. ఆద్యంతం కొత్తగా, ఫన్నీగా ఉంది. తాజాగా ఈ చిత్ర టైటిల్‌, టైటిల్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇది ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. నాని హీరోగా 28వ సినిమా కావడం విశేషం. 

కర్టెన్‌ రైజర్‌ పేరుతో విడుదల చేసిన ఈ టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌లో `కొంత మంది గుసగుసలాడుతుంటారు.. ష్‌..ఏంటీ అలా చెవులు కొరుక్కుంటున్నారని ఓ వ్యక్తి అనగా.. మరో వ్యక్తి(సుహాస్‌)..  ఓ విషయం చెప్పాలి సర్ అంటాడు. ఏంటదీ అంటే.. సర్‌ అంటే మరీ చెవిలో చెబుతానంటాడు. ఆ చెప్పమనగా.. ఏదో విషయం చెబుతాడు.. అవునా.. ప్రామిస్‌ అంటాడు. ప్రామిస్‌ సర్‌ అంటాడు.. 

ఏంటి సుప్రజ నిజమా.. అని ఆ సర్‌ అంటే.. అవునంటా సర్‌.. అందరు అదే అనుకుంటున్నారు.. అని ఓ లేడీ అంటుంటే...సుబ్బారావుగారు ఏంటండీ ఇది అని సర్‌ అంటే. అదేగదండీ.. అంటాడు. వాహ్‌.. ఎక్స్ లెంట్‌ అని, `అంటే సుందరానికీ` అని చెప్పి వదిలేశాడు. ఇంతలో నాని పంచె కట్టుకుని రెడ్‌ చెక్‌ షర్ట్ వేసుకుని విదేశాలకు బయలు దేరేందుకు రెడీగా ఉన్నట్టుగా బ్యాక్‌ సైడ్‌లో ఓ పోస్టర్‌.. `అంటే సుందరానికీ` అనే టైటిల్‌ వస్తుంది. చివరగా సుందరం పాచికలు వేయమందువా.. అంటే .. తనదైన స్టయిల్‌లో నాని నవ్వడం ఆకట్టుకుంది. 

మొత్తానికి ఇది జానపద కళలు, పురోహితులు, నాటకాలు.. వంటి వాటి చుట్టూ తిరుగుతుందని, నాని ఇందులో పురోహితులు మాదిరిగా, పండితుడిగా కనిపించనున్నారని  తెలుస్తుంది. అదే సమయంలో ఆద్యంతం ఫన్‌ ఎంటర్‌టైన్‌గా సాగుతుందని అర్థమవుతుంది. దీన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. ఇందులో నజ్రియా హీరోయిన్‌గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నాని `టక్‌ జగదీష్‌`తోపాటు `శ్యామ్‌సింగరాయ్‌` చిత్రాల్లో నటిస్తున్నారు.