నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘దసరా’ (Dasara). ఈ మూవీ షూటింగ్ కు ప్రస్తుతం కాస్తా బ్రేక్ వచ్చింది. అయితే గతంలో అనుకున్న సమయానికి కన్నా.. ఇంకస్తా ఆలస్యంగానే ‘దసరా’ ప్రేక్షకుల ముందుకు రానుందంట. 

నేచురల్ స్టార్ నాని (Nani) విభిన్న కథలను ఎంచుకుంటూ తన ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. తన సినిమాలు, పాత్రలు ఒకదానికొకటి భిన్నంగా ఉండేలా చూసుకుంటున్నాడు. తాజాగా నాని నటించిన చిత్రం ‘అంటే సుందరానికీ’రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అద్భుతమైన కామెడీని పండించడంతో సినిమాకు ప్రేక్షకాదరణ దక్కుతోంది. ఇదిలా ఉంటే నాని నటిస్తున్న మరో యాక్షన్ ఫిల్మ్ ‘దసరా’. ఈ చిత్రం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

'దసరా' నాని మొదటి పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ గా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందుతోంది. గోదావరిఖనిలోని సింగరేణి బొగ్గు గనుల్లోని ఓ గ్రామం నేపథ్యంలో సాగే కథగా అర్థమవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు ఇప్పటికే శరవేగంగా తెరకెక్కిస్తున్నాడు. సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ లను ఒకదాని తర్వాత మరొకటి పూర్తి చేస్తూ వస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని తొలుత ఆగస్టులో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. తర్వాత దసరా ఫెస్టివల్ కానుకగా తీసుకురావాలని షెడ్యూల్ చేశారు. ప్రస్తుతం రిలీజ్ కు సంబంధించి మరో టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ రేస్ లో Dasaraను రిలీజ్ చేయాలనే ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నాని ‘అంటే సుందరానికీ’ ప్రమోషన్స్ కోసం ‘దసరా’ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో చిత్రీకరణ కాస్తా ఆలస్యం కానున్నట్టు సమాచారం. అందుకే ఇంకాస్తా సమయం తీసుకుని రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ ఆకట్టుకున్నాయి. 'స్పార్క్ ఆఫ్ దసరా' గ్లింప్స్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. నాని మాస్ గెటప్, భయంకరమైన రూపంలో వీక్షకులను ఆశ్చర్యపరిచింది. నాని తొలిసారి యాక్షన్-ప్యాక్డ్ పాత్రను పోషిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. సత్యన్ సూర్యన్ ISC సినిమాటోగ్రఫీ అందించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.