తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.. కొంతవరకు స్పందిస్తున్నారు: బాలకృష్ణ
ప్రముఖ సినీ నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు.

ప్రముఖ సినీ నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌తో కలిసి బాలకృష్ణ ఆదివారం పరామర్శించారు. అనంతరం బాలకృష్ణ, శివరాజ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. తారకరత్నను పరామర్శించేందుకు వచ్చినందుకు శివరాజ్‌కుమార్‌కు బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
పీఈఎస్ ఆస్పత్రి వైద్యులు మంచి చికిత్స అందించారని.. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం నారాయణ హృదయాలయకు తీసుకురావడం జరిగిందని బాలకృష్ణ తెలిపారు. కుప్పంలో ఉన్నప్పుడు ఎలాగా ఉందో ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు కూడా అలాగే ఉందన్నారు. అయితే ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని.. క్షీణించడం లేదని చెప్పారు. ఇంప్రూవ్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నట్టుగా తెలిపారు. వైద్యులు అన్ని రకాలుగా కేర్ తీసుకుంటున్నారని చెప్పారు.
అయితే స్టంట్ వేయడం కుదరలేదని.. మళ్లీ అటాక్ వచ్చే అవకాశం ఉన్నందున డాక్టర్లు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు. చికత్సకు కొంతవరకు తారకరత్న స్పందిస్తున్నారని తెలిపారు. ఒకసారి గిచ్చితే కొద్దిగా స్పందించారని అన్నారు. అభిమానుల దీవెనలు, ప్రార్థనలతో త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని తెలిపారు. ఇక, శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ.. తారకరత్న చికత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టుగా చెప్పారు.
మరోవైపు తారకరత్న సోదరులు, సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ కూడా బెంగళూరులోని ఆస్పత్రికి చేరుకుని తారకరత్నను పరామర్శించారు. వైద్యులను, అక్కడే ఉన్న కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఇక, లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న సమయంలో తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బాలకృష్ణ తారకరత్న ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇతర కుటుంబ సభ్యులు కూడా నారాయణ హృదయాలయకు చేరుకుని తారకరత్నను పరామర్శించిన సంగతి తెలిసిందే.