సూపర్‌ స్టార్ మహేష్ బాబు కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా పోకిరి. ఈ సినిమా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా స్టార్‌ డైరెక్టర్ల లిస్ట్‌లో చేరిపోయాడు. ఇదే కాంబినేషన్లో వచ్చిన మరో మూవీ బిజినెస్‌మేన్‌. మహేష్‌ను డిఫరెంట్ యాటిట్యూడ్‌లో  చూపించిన ఈ సినిమా కూడా సూపర్‌ హిట్ అయ్యింది. దీంతో సూపర్‌ స్టార్ అభిమానులు ఇదే కాంబినేషన్‌లో మరో సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

పూరి కూడా చాలా కాలం క్రితమే మహేష్ కోసం జనగణమన అనే స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్టుగా చెప్పాడు. అయితే ఆ సమయంలో పూరికి వరుస ఫ్లాప్‌లు రావటంతో మహేష్ ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశాడు. ఇదే విషయాన్ని పూరి ఓ ఇంటర్వ్యూలో బహిరంగంగానే చెప్పాడు. దీంతో ఇక మహేష్‌, పూరి కాంబినేషన్‌లో సినిమా ఉండదని భావించారు అంతా. అంతే కాదు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు కూడా ఆత్మాభిమానం ఉందంటూ మాట్లాడాడు.

అయితే ఇటీవల ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూరి మరో సూపర్‌ హిట్ అందుకోవటంతో మళ్లీ పూరి, మహేష్‌ కాంబినేషన్‌పై చర్చ మొదలైంది. అయితే ఈ విషయంపై నమ్రతను ప్రశ్నించారు అభిమానులు. మంగళవారం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది నమ్రత. ఈ నేపథ్యంలో ఓ అభిమాని మహేష్, పూరి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు అంటూ ప్రశ్నించాడు. అందుకు సమాధానం ఇచ్చిన నమ్రత అది కాలమే నిర్ణయించాలి అంటూ కామెంట్ చేసింది..