టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున తమిళంలో ధనుష్ తో కలిసి ఓ మల్టీస్టారర్ లో నటించడానికి సైన్ చేశారు. 'రుద్ర' అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. నిజానికి రజినీకాంత్ తో చేయాల్సిన పాత్ర అది. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో నాగార్జునని తీసుకున్నారు.

ఎస్ జే సూర్య, అరవింద్ స్వామీ, అడితిరావు హైదరి వంటి తారలు సినిమాలో ఉండడంతో ప్రాజెక్ట్ పై హైప్ పెరిగింది. రూ.70కోట్లతో సినిమాను రూపొందించడానికి ప్లాన్ చేసుకున్నారు. నాగార్జున సినిమా షూటింగ్ కి కూడా హాజరయ్యాడు. అయితే సడెన్ గా సినిమాకి బ్రేక్ పడింది.

ఎవరూ దాని గురించి స్పందించలేదు. నాగ్ కూడా ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడలేదు. తాజాగా నాగార్జున నటించిన 'మన్మథుడు 2' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించారు నాగ్. ఈ క్రమంలో ధనుష్ సినిమా ప్రస్తావన వచ్చింది. ఆ సినిమా ఆగిపోవడం తనకు కూడా పెద్ద షాక్ అని చెప్పాడు నాగ్. సినిమా కోసం దాదాపు 35 రోజులు షూటింగ్ చేశామని.. ఆ తరువాత ఏమైందో తెలియదని.. సినిమా రద్దయిందని.. అది పెద్ద షాక్ అంటూ చెప్పుకొచ్చాడు నాగ్.

ఇక హిందీలో తాను చేస్తోన్న మరో మల్టీస్టారర్ సినిమా 'బ్రహ్మాస్త్ర'లో తన పాత్ర సర్ప్రైజింగ్ గా ఉంటుందని.. సినిమాలో ప్రతీ పాత్ర అధ్బుతంగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం కొత్త సినిమాలేవీ కమిట్ కాలేదని అన్నారు.