మంచువారి ఫ్యామిలీ నిందేస్తే మెగా ఫ్యామిలీ ఆదరించింది. మంచు విష్ణు కార్యాలయంలో చోరీకి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న హెయిర్ డ్రెస్సెర్ నాగ శ్రీనుకు నటుడు నాగబాబు ఆర్ధిక సహాయం చేయడంతో వివాదం కొత్త మలుపు తీసుకుంది.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు వేదికగా మంచు, మెగా ఫ్యామిలీ మధ్య చిచ్చు రేగిన విషయం తెలిసిందే. మా ప్రెసిడెంట్ పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు(Manchu Vishnu) తలపడ్డారు. మంచు విష్ణుకు పరిశ్రమలోని ఒక సామాజిక వర్గం పూర్తి మద్దతు ఇచ్చింది . అదే సమయంలో ప్రకాష్ రాజ్ వెనుక మేమున్నామంటూ నాగబాబు, పవన్ బహిరంగంగా ప్రకటించారు. చిరంజీవి సైతం పరోక్షంగా మద్దతిచ్చారు. ఇరు వర్గాలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై గెలిచి... ఆధిపత్యం చాటుకున్నారు .
మంచు విష్ణు గెలుపును నాగబాబు అంగీకరించలేదు. ఆయన తీవ్ర అసహనానికి గురికావడంతో పాటు మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. మా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన మోహన్ బాబు ఫ్యామిలీ పరిశ్రమ పెద్దలం మేమే అని ఫీల్ అవుతుంటే... సినిమా సమస్యల పరిష్కారానికి సంబంధించిన చర్చల విషయంలో చిరంజీవికి ఏపీ సీఎం జగన్ పెద్దపీట వేయడం... మంచు వారి గుండెల్లో మంట పెట్టింది. అలాగే సన్ ఆఫ్ ఇండియా మూవీ ఘోర పరాజయం పాలవడంతో మోహన్ బాబు ఫైర్ అయ్యారు. ఈ సినిమా పరాజయానికి పూర్తి బాధ్యత ట్రోలర్స్ దేనన్న ఆయన.. దీని వెనుక ఓ ఇద్దరు హీరోల హస్తం ఉందని ఆరోపణలు చేశారు.
వరుస పరిణామాల నేపథ్యంలో మెగా-మంచు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. తాజాగా మోహన్ బాబు(Mohan Babu), మంచు విష్ణు మరొక వివాదంలో చిక్కుకున్నారు. మంచు విష్ణు తన దగ్గర పనిచేసే హెయిర్ డ్రెస్సెర్ నాగ శ్రీనుపై దొంగతనం కేసు పెట్టారు. రూ. 5 లక్షల విలువైన హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రి దొంగిలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగ శ్రీను ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. కులం పేరుతో నన్ను దూషించిన కారణంగా మంచు విష్ణు వద్ద జాబ్ మానేశాను, అయితే మోహన్ బాబు, మంచు విష్ణు నాపై దొంగతనం ఆరోపణలు చేస్తున్నారు. అందులో నిజం లేదన్నారు.
ఈ వివాదం ఇలా నడుస్తుండగా.. నాగబాబు(Nagababu) సీన్ లోకి రాకతో కొత్త మలుపు తిరిగింది. నాగ శ్రీను కుటుంబాన్ని తన నివాసానికి పిలిపించిన నాగబాబు అతనికి రూ. 50 వేలు ఆర్ధిక సహాయం చేశారు. అలాగే అపోలో ఆసుపత్రిలో నాగ శ్రీను ఇద్దరు పిల్లలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించి, చికిత్స ఇప్పిస్తానంటూ హామీ ఇచ్చారు.
దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మీమ్స్ పేలుతున్నాయి. మంచు వారిపై వచ్చిన వ్యతిరేకతను నాగబాబు తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. నాగ శ్రీను, మంచు కుటుంబం వివాదంలో ఎవరిది తప్పనేది ఇంకా పూర్తిగా తెలియదు. ఇరు వర్గాలు ఆరోపణలు చేసుకుంటున్నారు. నాగబాబు హెయిర్ డ్రెస్సెర్ నాగ శ్రీనుకు ఆర్ధిక సహాయం చేయడం ద్వారా తప్పు మంచు ఫ్యామిలీదే అని పరోక్షంగా చెప్పినట్లయింది. తాజా పరిణామం మంచు విష్ణు, మోహన్ బాబులను ఆగ్రహానికి గురిచేస్తుంది అనడంలో ఎటువంటి సందేశం లేదు.
