అక్కినేని నాగ చైతన్య ఈ ఏడాది మజిలీ చిత్రంతో ఘనవిజయం సొంతం చేసుకున్నాడు. దీనితో తన తదుపరి చిత్రాల కోసం చైతు ఉత్సాహంగా సిద్ధం అవుతున్నాడు. కొన్ని రోజులుగా నాగ చైతన్య కొత్త చిత్రం గురించి అనేక వార్తలు వచ్చాయి. అజయ్ భూపతి దర్శకత్వంలో ఉంటుందని, మరో కొత్త దర్శకుడుతో ఉంటుందని వార్తలు వచ్చాయి. 

ఆ ఊహాగానాలకు చెక్ పెడుతూ నాగ చైతన్య కొత్త సినిమాకు అధికారిక ప్రకటన వచ్చింది. శేఖర్ కమ్ముల దర్శత్వంలో నాగ చైతన్య నటించబోతున్నాడు. ఫిదా బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. సింపుల్ కథలని ఎమోషనల్ గా తీయడంలో శేఖర్ కమ్ముల సిద్ధహస్తుడు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ చిత్రంలో చైతూకి జోడిగా సాయి పల్లవి నటించబోతోంది. 

ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏసియన్ కంపెనీ నిర్మించబోతోంది. ఆ సంస్థకు చెందిన నారాయణదాస్, చైర్మన్ రామ్మోహనరావు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. సెప్టెంబర్ లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించి డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.