కరోనా కారణంగా సినీరంగం తీవ్ర స్థాయిలో నష్టపోయింది. ఈ సమస్యల నుంచి తిరిగి ఎప్పటికి కోలుకుంటుందో కూడా చెప్పలేని పరిస్థితి. షూటింగ్ లు మధ్యలో ఆగిపోవటం, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సినిమాల రిలీజ్‌లు ఆగిపోవటంతో నిర్మాతలకు అప్పులు తడిమోపెడవుతున్నాయి. అదే సమయంలో థియేటర్లు తిరిగి ఓపెన్ అయినా ఎంత మంది వస్తారన్నది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ నేపథ్యంలో సినీ పెద్దలు ఇండస్ట్రీని కాపాడేందుకు, జనాలను తిరిగి థియేటర్లకు రప్పించేందుకు రకరకాల ఆలోచనలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మహానటి చిత్ర దర్శకుడు నాగ అశ్విన్‌ ఓ ప్రతిపాదనను తెర మీదకు తీసుకువచ్చాడు. `గతంలో సురేష్ బాబు, రానాతో మాట్లాడుతున్నప్పుడు ఓ ఆలోచన వచ్చింది. కొన్ని దేశాల్లో ఉన్నట్టుగా మన దగ్గర కూడా థియేటర్లలో మధ్యం సర్వ్‌ చేసేందుకు అనుమతులు పొందితే ఎలా ఉంటుంది. వీటి వల్ల ప్రేక్షకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. థియేటర్‌ బిజినెస్‌ను అది కాపాడుతుంది (ప్రస్తుతం సినిమాను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది) మీరే మంటారు..? మంచి ఐడియానా.? లేక చెత్త ఐడియానా?

కానీ ఒక విషయం మాత్రం నిజం దీని వల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌ దూరమవుతారు. కాబట్టి కొన్ని మల్టిప్లెక్స్‌ లలో మాత్రమే ఈ వెసులుబాటు కల్పించొచ్చు. ఎలాగైన ప్రేక్షకులను థియేటర్లకు ఎలా రప్పించగలమో ఆలొచించాలి` అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌పై నెటిజెన్ల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు మంచి నిర్ణయం అని సమర్థిస్తుంటే.. మరికొందరు మాత్రం మంచి సినిమా రిలీజ్ చేస్తే చాలు, ప్రేక్షకులు థియేటర్లకు వాళ్లే వస్తారు అంటూ తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. మరికొందరు సినిమా నిర్మాణ ఖర్చులు, రెమ్యూనరేషన్ తగ్గించుకొని టికెట్ రేట్లు తగ్గిస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని సలహా ఇచ్చారు.