ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు కీరవాణికి ఇద్దరు కుమారులు. ఇద్దరూ కూడా సినిమా ఇండస్ట్రీలోనే పని చేస్తున్నారు. కాలభైరవ సింగర్ గా రాణిస్తుంటే.. మరో కుమారుడు శ్రీసింహా సహాయ దర్శకుడిగా పని చేస్తున్నాడు. సుకుమార్ తెరకెక్కించిన 'రంగస్థలం' సినిమాకి శ్రీసింహా సహాయదర్శకుడిగా పని చేశారు.

ఆ చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీస్ సంస్థ ఇప్పుడు శ్రీసింహాని హీరోగా పరిచయం చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం శ్రీసింహా కోసం కొత్త కథలను ఎంపిక చేసే పనిలో పడింది. ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నాడు. శ్రీసింహా దర్శకుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చాడు.

ఆ డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు నటుడిగా ఛాన్స్ రావడంతో హీరోగా తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. కసరత్తులు కూడా మొదలెట్టాడు. మొత్తానికి మెగాఫోన్ పట్టాలనుకున్న శ్రీసింహా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.

ఇప్పటివరకు భారీ బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ వచ్చిన మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు చిన్న సినిమాలపై దృష్టి పెట్టింది. టాలెంట్ ఉన్న యువ దర్శకులను గుర్తించి వాళ్లతో కథలను సిద్ధం చేయిస్తోంది. అందులో ఓ కథలో శ్రీసింహా హీరోగా కనిపించబోతున్నాడు.