పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఇక సినిమాలు చేయరని అంతా అనుకున్నారు. అయితే ఇటీవల తనకు సినిమాలు తప్ప ఏ పని చేతకాదని, ఇతర పార్టీల నాయకుల్లా కాంట్రాక్ట్ లు, వ్యాపారాలు లేవని.. తన జీవనాధారం సినిమాలు మాత్రమేనని చెప్పడంతో అభిమానుల్లో ఆయన మళ్లీ నటిస్తాడనే ఆశ చిగురించింది.

ఈ క్రమంలో  సినిమాల్లో ఆయన రీఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏడాది చివరికల్లా పవన్ కొత్త సినిమా ప్రారంభం కాబోతుందని, దానికోసం పవన్ కొంత సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నారు.

ఈ మేరకు పవన్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చారని సమాచారం. అయితే పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడం వలన సినిమా చేయలేకపోయారు. ఇప్పుడు పవన్ బ్రేక్ లో ఉన్న కారణంగా ఆయనకి కథ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అడ్వాన్స్ కాకుండా రెమ్యునరేషన్ గా ముప్పై కోట్లు ఇవ్వాలని భావిస్తున్నారట.

పవన్ కథ గనుక ఓకే చేస్తే వెంటనే డైరెక్టర్ ని లాక్ చేసి సినిమా మొదలుపెట్టాలని చూస్తున్నారు. ప్రస్తుతం బాల్ పవన్ కోర్ట్ లో ఉంది. ఇది ఇలా ఉండగా.. మరోపక్క రామ్ తాళ్ళూరి , హారిక అండ్ హాసిని సంస్థ కూడా పవన్ తో సినిమాలు చేయాలనుకుంటుంది.