విషాదం.. ‘సిసింద్రీ’ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మృతి.. ఎలా జరిగిందంటే?
90'sలో ఎన్నో చిత్రాలకు సూపర్ హిట్ సాంగ్స్ అందించిన సంగీత దర్శకుడు ‘రాజ్-కోటీ’లో రాజ్ కొద్దిసేపటి కింద మృతి చెందారు. ఈ మేరకు అధికారిక ప్రకటన అందింది.
ఫిల్మ్ మ్యూజిక్ కంపోజర్స్ తోటకూర సోమరాజు మరియు సాలూరి కోటేశ్వర్ రావు సంగీత ప్రియులకి ‘రాజ్-కోటీ’గా పరిచయం. 90'sలో ఎన్నో చిత్రాలకు సూపర్ హిట్ సాంగ్స్ అందించిన సంగీత దర్శకులు వీరు. అయితే వీరిలో మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ (68) కొద్దిసేపటి కింద కన్నుమూశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడులైంది.
ఆయన బాత్ రూమ్ లో కాలు జారిపడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. బాత్ రూమ్ లో పడ్డ సమయంలోనే గుండెపోటు కూడా రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు సన్నిహితులు తెలిపారు. గంట కిందనే కన్నుమూసినట్టు వెల్లడించారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో గల ఫోరమ్ మాల్ దగ్గరే ఆయన నివాసం ఉంటున్నారు. ఈయనకు ముగ్గురు కూతుర్లు దీప్తి, దివ్య, శ్వేత ఉన్నారు. రెండో అమ్మాయి దివ్య చిత్ర పరిశ్రమలోనే అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.
మూడో అమ్మాయి శ్వేత మలేషియాలో నివసిస్తోంది. ఆమెకు సమాచారం అందించడంతో ఇండియాకు తిరిగి వస్తున్నారు. ఆమె చేరుకోగానే రేపు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఉన్నట్టుడి రాజ్ మరణవార్త వినాల్సి రావడంతో సినిమా ప్రముఖులు దిగ్భాంతికి గురవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులకూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ఇక రాజ్- కోటీ ద్వయం సంగీత దర్శకత్వంలో 180కి పైగా సినిమాలు చేశారు. 3000 పాటలకు వీరిద్దరూ కలిసి బాణీలు కట్టారు. ఇందులో 2500 పాటలను స్వర్గీయ, ప్రముఖ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, కేఎస్ సుచిత్రలు పాడటం విశేషం. ఏఆర్ రెహమాన్ సైతం ఎనిమిది సంవత్సరాల పాటు వీరితో కలిసి కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా పనిచేయడం గమనార్హం. 2012 నుంచే మళ్లీ రాజ్-కోటి బ్రాండ్‌ను పునఃస్థాపిస్తున్నట్లు ప్రకటించారు. కానీ అది కార్యరూపం దాల్చినట్టు లేదు.
‘ప్రళయ గర్జన’ గర్జన చిత్రంతో రాజ్-కోటీ సంగీత దర్శకులుగా కేరీర్ ను ప్రారంభించారు. 1999 వరకు ఎన్నో చిత్రాలకు సంగీతం అందించారు. ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి బాలకృష్ణ, జగపతి బాబు, సుమన్, నాగార్జున నటించిన చిత్రాలకు సంగీతం అందించారు. నాగార్జున ‘హలో బ్రదర్’ చిత్రానికి అందించిన మ్యూజిక్ కు 1994లో వీరికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నంది అవార్డు కూడా దక్కింది.
రాజ్ సోలోగానూ కొన్ని చిత్రాలకు సంగీతం అందించారు. అందులో సంగీత ప్రియులను బాగా మెప్పించిన చిత్రం ‘సిసింద్రీ’. ఈ సినిమా పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అలాగే భరత సింహం, రాముడొచ్చాడు, మృగం, బొబ్బిలి బుల్లోడు, సంభవం, ప్రేమంటే ఇదేరా, చిన్ని చిన్ని ఆశ, సూర్య పుత్రిక, లగ్న పత్రిక వంటి సినిమాలకు సంగీతం అందించారు. ఈయన చివరిగా ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ చిత్రం సెకండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ కు హాజరయ్యారు.