కె విశ్వనాథ్ మృతి పట్ల ఇళయరాజా తెలుగులో సంతాపం..
తెలుగు తెర దర్శక శిఖరం, కళాతపస్వి కె విశ్వనాథ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలియాజేస్తున్నారు. తాజాగా సంగీత దర్శకుడు ఇళయరాజా తెలుగులో తనసంతాపం సందేశాన్ని పంపించారు.

కళాతపస్వి కె విశ్వనాథ్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. తెలుగు సినిమాలో ఓ శకం ముగిసిందంటూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి, చంద్రమోహన్‌లాంటి వాళ్లు ఎమోషనల్ అయ్యారు. కమల్, నాగ్, బాలయ్య, పవన్, మహేష్, ఎన్టీఆర్, రవితేజ, మోహన్‌బాబు, రాజమౌళి, కీరవాణి, ఇతర దర్శకులు, నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
అందులో భాగంగా మ్యూజికల్ మ్యాస్ట్రో, ఎంపీ ఇళయరాజా సైతం తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని విడుదల చేశారు. ఇందులో ఇళయరాజా తెలుగులో తన విచారం వ్యక్తం చేయడం విశేషం. ఆయన మాట్లాడుతూ, `ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ముఖ్యమైన, ప్రధాన స్థానంలో ఉన్న, చాలా ముఖ్యమైన దర్శకుడు కె విశ్వనాథ్ దేవుడు పాదాల వద్దకు వెళ్లారని తెలిసి నాకు చాలా బాధ కలిగింది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని దేవుడుని ప్రార్థిస్తున్నా` అని తెలిపారు మ్యాజిక్ మ్యాస్ట్రో, ఎంపీ ఇళయరాజా. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వీడియోని పంచుకున్నారు ఇళయరాజా.
కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన `స్వాతిముత్యం`, `స్వర్ణకమలం`, `చిన్నబ్బాయి` వంటి చిత్రాలకు ఇళయరాజా సంగీతం అందించారు. మొదటి రెండు చిత్రాలు సంగీతం పరంగా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. బ్లాక్ బస్టర్స్ మాత్రమే కాదు, క్లాసిక్స్ కూడా.
ఇదిలా ఉంటే ఇళయరాజా హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున మ్యూజిక్ లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతున్నారు. ఫిబ్రవరి 26న గచ్చిబౌలి స్టేడియం లో 'హైదరాబాద్ టాకీస్' వారు నిర్వహించనున్న ఈ భారీ ఈవెంట్ ఎంట్రీ టికెట్లు శరవేగంగా అమ్ముడవుతున్నాయి. ఇటీవల దీనికి సంబంధించిన ట్రైలర్ ని రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ డిజిటల్ లాంచ్ చేయడంతో ఈవెంట్ పై అంచనాలు ఆకాషాన్నంటాయి.