పలు టీవీ సీరియళ్ళలో, సినిమాలలో నటించే ఏ.రామచంద్రబాబు అనే నటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు పదేళ్ల క్రితం రామచంద్రబాబుపై నగర నేర పరిశోధన విభాగం అధికారులు కేసు నమోదు చేశారు. అప్పట్లో ముందస్తు బెయిల్ పొంది అరెస్ట్ నుండి తప్పించుకున్నాడు. కానీ ఈసారి మాత్రం అధికారులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ లోని సర్వే నెం.129/35 లో ఖాదర్ భాషాతో పాటు మరికొందరికి మూడు ఎకరాలు, 21 గుంటల స్థలం ఉంది. వీరికి ఇరవై లక్షలు ఇస్తానంటూ కొన్ని పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నాడు రామచంద్రబాబు. ఆ సంతకాలు వాడుకొని స్థలం తన పేరు మీదే ఉందని.. సంతోష్ నగర్ కి చెందిన శ్రీఇనివాస్ అనే వ్యక్తిని నమ్మించి అతడి దగ్గర నుండి రూ.60 లక్షలు తీసుకున్నాడు.

తీసుకున్న డబ్బుకి గాను స్థలంలో పాతిక శాతం వాటా ఇస్తానని నమ్మించాడు. ఈ విషయంలో కర్నూలుకి చెందిన ఓ రాజకీయనాయకుడు మధ్యవర్తిగా వ్యవహరించాడు. కొన్ని రోజుల తరువాత  రామచంద్రబాబు.. శ్రీనివాస్ వద్ద మరో రూ.50 లక్షలు తీసుకున్నాడు. స్థలంలో వాటా ఇవ్వకపోగా, డబ్బు కూడా ఇవ్వడం లేదని శ్రీనివాస్ వాకబు చేయగా అసలు స్థలం కూడా రామచంద్రబాబుది కాదని తెలుసుకున్నాడు.

ఈ క్రమంలో అతడు 2009లో నగర నేర పరిశోధన అధికారులకి ఫిర్యాదు చేశాడు. అతడిని అదుపులోకి తీసుకుందామనుకుంటే ముందస్తు బెయిల్ తో బయటపడ్డాడు. గత నెలలో ఈ బెయిల్ గడువు ముగిసింది. దీంతో అధికారులు రామచంద్రబాబుని అరెస్ట్ చేశారు. అయితే కోర్టు అతడికి మరోసారి బెయిల్ మంజూరు చేసింది.