నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తెరంగ్రేటం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కొడుకును వెండితెరకు పరిచయం చేయడానికి బాలకృష్ణ భారీగానే రెడీ అవుతున్నారంటున్నారు. అలాగే తన కుమారుడుని లాంచ్ చేయటం కోసం డైరక్టర్స్ ని వెతుకుతున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతాబాగుంది. కానీ మోక్షజ్ఞ మాత్రం ఇంకా రెడీ కాలేదని మొన్న బాలయ్య పుట్టిన రోజు సందర్బంగా బయిటకు వచ్చిన ఫొటోలతో అర్దమైంది. ఒకటి రెండు సంవత్సరాలు కష్టపడితే కానీ హీరోగా తెరకెక్కటానికి సరిపోడని మీడియా తేల్చేస్తోంది. అయితే అదే సమయంలో మోక్షజ్ఞకి ఓ వర్గం నుంచి మద్దతు గట్టిగానే లభిస్తోంది.

వారు మోక్షజ్ఞని ... సినిమాల్లో వచ్చిన కొత్తలో ఉన్న ఎన్టీఆర్ లుక్ తో పోలుస్తున్నారు. ఎన్టీఆర్ కూడా మొదట్లో బొద్దుగా ఉండేవాడని ఆ తరువాత మెల్లిగా మారాడు. అలాగే మోక్షజ్ఞ కూడా మారతాడని, ఇవాళ ట్రోల్ చేసిన వాళ్లే రేపు అభిమానులుగా మారతారని నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే అది ఎన్టీఆర్ అభిమానులకు సాధారణంగానే మండుతోంది. ఇప్పుడా పాత లుక్ లు గొడవ ఎందుకు... అప్పటి రోజులు వేరు..ఇప్పుడు వేరు అని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా నందమూరి నట వారసుడి ఎంట్రీ అదిరిపోవాలని, బాక్సాఫీసులు బద్దలైపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇదిలో ఉంటే మోక్షఙ్ఞ ఎంట్రీ బాధ్యతలను దర్శకధీరుడు రాజమౌళి తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే మోక్షఙ్ఞను రాజమౌళి డైరెక్ట్ చేయరట. ఆయన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ గా చేసిన డైరెక్టర్ నందమూరి వారసుడి సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారట. కాకపోతే ఆ సినిమా జక్కన్న దర్శకత్వ పర్యవేక్షణలో జరగబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి స్క్రిప్ట్ పనులు కూడా ప్రారంభమైనట్లు టాక్. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై మోక్షఙ్ఞ మొదటి చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.