కంప్లీట్ యాక్టర్‌గా పేరుతెచ్చుకున్న మోహన్‌లాల్‌కి అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. కేంద్రప్రభుత్వం ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది.
మోహన్‌లాల్‌కి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
సినిమా రంగానికి చేసిన సేవలకు గాను మోహన్‌లాల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం దక్కింది. 2023 సంవత్సరానికి గాను ఈ అత్యున్నత పురస్కారం ఆయనకు వరించింది. మోహన్‌లాల్ సినీ ప్రస్థానం ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకమని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. 2025 సెప్టెంబర్ 23న (మంగళవారం) జరిగే 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో మోహన్‌లాల్‌కు ఈ అవార్డును అందజేయనున్నారు.
మోహన్‌లాల్ సినీ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తి
‘మోహన్‌లాల్ అద్భుతమైన సినీ ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు ఈ గౌరవం దక్కింది. ఆయన అసమాన ప్రతిభ, నైపుణ్యం, నిరంతర కృషి భారతీయ సినిమా చరిత్రకే ఒక సువర్ణ ఘట్టం’ అని కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.
పద్మభూషణ్‌తో గౌరవించిన కేంద్ర ప్రభుత్వం
గత నాలుగు దశాబ్దాలుగా మలయాళ చిత్ర పరిశ్రమలో మోహన్‌లాల్ ఒక చెరగని ముద్ర వేశారు. 'మంజిల్ విరింజా పూక్కళ్' చిత్రంలో విలన్‌గా అడుగుపెట్టి, ఆ తర్వాత మలయాళ సినిమాకు పెద్ద దిక్కుగా మారారు. ఎవరూ అనుకరించలేని ఎన్నో అద్భుతమైన సినిమాలు, పాత్రలు చేసి మెప్పించారు. అద్భుతమైన నటనతో అలరించారు. నటుడిగానే కాకుండా, నేపథ్య గాయకుడిగా, నిర్మాతగా కూడా మోహన్‌లాల్ రాణించారు. రెండు సార్లు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులను అందుకున్నారు. మొత్తంగా ఐదు జాతీయ పురస్కారాలు మోహన్‌లాల్‌ను వరించాయి. 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్‌తో కేంద్ర ప్రభుత్వాలు ఆయన్ని గౌరవించాయి. అలాగే లెఫ్లినెంట్ కల్నల్‌గానూ గౌరవించారు. ఇప్పుడు ఆయనకు సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించడం విశేషం.
