- Home
- Entertainment
- ఆస్కార్ బరిలో దిగిన తెలుగు సినిమాలివే.. పుష్ప 2, కుబేర, కన్నప్ప, సంక్రాంతికి.. ఈ సారి రికార్డు స్థాయిలో
ఆస్కార్ బరిలో దిగిన తెలుగు సినిమాలివే.. పుష్ప 2, కుబేర, కన్నప్ప, సంక్రాంతికి.. ఈ సారి రికార్డు స్థాయిలో
వచ్చే ఏడాదికి సంబంధించిన ఆస్కార్ అవార్డుల కోసం తెలుగు సినిమాలు ఈ సారి భారీగా పోటీ పడుతున్నాయి. వాటిలో `పుష్ప 2`, `కుబేర`, `కన్నప్ప` వంటి చిత్రాలుండటం విశేషం.

ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా భావించే సినీ అవార్డు ఆస్కార్
ఆస్కార్ అవార్డు అనేది సినిమాలకు సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావిస్తుంటారు. అయితే హాలీవుడ్ చిత్రాల కోసమే ఈ అవార్డులను ప్రారంభించారు. కాకపోతే ఇతర దేశాల సినిమాలకు కూడా అవకాశం కల్పిస్తుంటారు. దీంతో చాలా కాలంగా వివిధ విభాగాల్లో ఆస్కార్ కోసం మన ఇండియన్ సినిమాలు పోటీ పడుతుంటాయి. కాకపోతే కొన్ని మాత్రమే నామినేషన్‌కి ఎంపికవుతుంటాయి. కానీ ఆస్కార్ అనేది ఒక కలలాగానే మిగిలిపోతుంది.
ఆస్కార్ కలని సాధించిన `ఆర్‌ఆర్‌ఆర్`
ఇంగ్లీష్ మూవీ(స్లమ్ డాగ్ మిలియనీర్)కి మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్ ఆస్కార్ వరించింది. ఆ తర్వాత మూడేళ్ల క్రితం `ఆర్‌ఆర్‌ఆర్` మూవీకి ఆస్కార్ దక్కింది. టెక్నీకల్ విభాగంలో అవార్డు రావడం విశేషం. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన `ఆర్‌ఆర్‌ఆర్` మూవీ నాటు నాటు పాటకిగానూ ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఎంఎం కీరవాణి, రైటర్ చంద్రబోస్ ఈ పురస్కారాలను సొంతం చేసుకున్నారు. ఇక ఇండియన్ సినిమాకి అవార్డు రావడమనేది భారతీయ సినిమా చరిత్రలోనే ఇది మొదటిసారి కావడం విశేషం. దీంతోపాటు రెండు డాక్యుమెంటరీ చిత్రాలకు ఆస్కార్ దక్కింది.
ఈ సారి ఆస్కార్ పోటీలో `పుష్ప 2`
క్రమంగా ఆస్కార్ అవార్డు కోసం పోటీపడే మన సినిమాల సంఖ్య పెరిగిపోతుంది. ఈ సారి ఏకంగా ఐదు తెలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. వాటిలో `పుష్ప 2` ప్రధానంగా ఉంది. వచ్చే ఏడాది 2026 ఆస్కార్ అవార్డుల కోసం వివిధ భాషల నుంచి అప్లికేషన్స్ వచ్చాయి. అందులో భాగంగా తెలుగు నుంచి ఐదు సినిమాలు పోటీ పడుతుండటం విశేషం. తాజాగా దీనికి సంబంధించిన లిస్ట్ ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఇందులో `పుష్ప 2` సినిమా ఉండటం విశేషం. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ రూపొందించిన చిత్రమిది. రష్మిక మందన్నా హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 1800కోట్లు వసూలు చేసింది.
అకాడమీ అవార్డు కోసం `కుబేర`, `గాంధీ తాత చెట్టు` పోటీ
అలాగే నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా కలిసి నటించిన `కుబేర` మూవీ కూడా ఉంది. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా, ఏషియన్ సునీల్, రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. సమ్మర్‌లో వచ్చిన ఈ మూవీ మంచి ఆదరణ పొందింది. మరోవైపు మొన్న జాతీయ అవార్డు అందుకున్న బాలనటి, సుకుమార్ కూతురు సుకృతి వేణి నటించిన `గాంధీ తాత చెట్టు` చిత్రం కూడా ఆస్కార్ పోటీలో ఉండటం విశేషం. ఈ చిత్రానికి పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ నిర్మించాయి.
ఆస్కార్ నామినేషన్ రేసులో `కన్నప్ప`
అలాగే మంచు వారి ప్రతిష్టాత్మక మూవీ `కన్నప్ప` కూడా ఆస్కార్ బరిలో ఉంది. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. మంచు మోహన్‌బాబు నిర్మించారు. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్, శరత్ కుమార్, మధుబాల వంటి వారు ముఖ్య పాత్రలు, గెస్ట్ రోల్స్ చేశారు. ఆ మధ్య విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది.
2026 అకాడమీ అవార్డు కోసం `సంక్రాంతికి వస్తున్నాం` సై
వీటితోపాటు ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ కూడా ఆస్కార్ కోసం పోటీలో ఉంది. ఇందులో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరీ హీరోహీరోయిన్లుగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, దిల్ రాజు నిర్మించారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఏకంగా రూ.300కోట్లకుపైగా వసూళ్లని రాబట్టి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఆస్కార్ కోసం పోటీ పడుతున్న ప్రముఖ ఇండియన్ సినిమాలు
అయితే ఇవన్నీ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తమకు వచ్చిన అప్లికేషన్స్ ని లిస్ట్ చేసింది. వీటిలో ఇతర భాషల నుంచి `కేసరి 2`, `ది బెంగాల్ ఫైల్స్`, `ఫూలే`తోపాటు కన్నడ నుంచి `వీర చంద్రహాస` వంటి చిత్రాలున్నాయి. వీటిని ఫిల్టర్ చేసి రెండు మూడు సినిమాలను ఆస్కార్ నామినేషన్స్ కి పంపిస్తారు. వాటిలో బాగుంటే ఒక్క మూవీకి నామినేషన్ దక్కుతుంది. ఇదంతా పెద్ద ప్రాసెస్. దానికి చాలా టైమ్ పడుతుంది. ఇక 2026ఏడాదికి సంబంధించిన 98వ ఆస్కార్ అవార్డు వేడుక మార్చి 15న జరుగుతుంది.