మెగాస్టార్‌ చిరంజీవిని కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు కలిశారు. `ఆచార్య` సెట్‌లో స్నేహపూర్వకంగా చిరంజీవిని కలిశారు మోహన్‌బాబు. సినిమా సెట్‌కి మోహన్‌బాబు రావడంతో ఆనందంతో ఆహ్వానించారు చిరు. పూల బొకేలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాసేపు వీరిద్దరు సరదాగా మాట్లాడుకున్నారు. సినిమా షూటింగ్‌ గురించి చర్చించుకున్నట్టు తెలుస్తుంది. మోహన్‌బాబు ప్రస్తుతం `సన్‌ ఆఫ్‌ ఇండియా` నటిస్తున్న విషయం తెలిసిందే. 

చిరంజీవి, మోహన్‌బాబు వీరిద్దరు చిరకాల మిత్రులనే విషయం తెలిసిందే. అదే సమయంలో వీరిద్దరికి పడని సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. వీరిద్దరి మధ్య చాలా సార్లు టామ్‌ అండ్‌ జెర్రీ లాంటి సన్నివేశాలే చోటు చేసుకుంటుంటాయి. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం మంచు విష్ణు కూడా చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. ఎందుకు కలిశామన్నది త్వరలోనే తెలుస్తుంది. ఆయన మెగాస్టార్‌ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదన్నారు.

ఇప్పుడు మంచు మోహన్‌బాబు స్వయంగా సెట్‌కి వెళ్ళి కలవడం చర్చనీయాంశంగా మారింది. వీరి మధ్య భారీ ప్లానేదో జరుగుతుందని, ఏదో చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి `సన్‌ ఆఫ్‌ ఇండియా` చిత్రంలో చిరంజీవిని గెస్ట్ రోల్‌ అడిగారా? లేక కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్ చేపడుతున్నారా? అదీ కాకపోతే ఇండస్ట్రీలో ఇంకా ఏదైనా చేయబోతున్నారా? అనే చర్చ మొదలైంది. మొత్తానికి వీరి అరుదైన కలయిక అనేక అనుమానాలకు, ప్రశ్నలకు తావిస్తుంది.